ఫిరోజ్ షా కోట్లా స్టేడియం అధికారికంగా అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. ఇటీవలే మాజీ కేంద్ర మంత్రి, డిల్లీ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అరుణ్ జైట్లీ మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన  గౌరవార్థం డిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా స్టేడియం పేరును అరుణ్ జైట్లీ స్టేడియంగా మార్చనున్నట్లు  డిల్లీ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించింది. 

గురువారం అధికారికంగా కోట్లా స్టేడియం కాస్త అరుణ్ జైట్లీ స్టేడియంగా మారింది. డిల్లీ క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పేరు మార్పు కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలు  ముఖ్య అతిథులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మొత్తం జైట్లీని గుర్తుచేసుకుంటూనే సాగింది. 

ఈ సందర్భంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడుతూ బాధలో వున్నపుడు జైట్లీ ఓదార్చిన తీరును గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. తన తండ్రి ప్రేమ్ కోహ్లీ మృతితో తీవ్ర డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన తనకు జైట్లీ అండగా నిలిచారని వెల్లడించాడు. ఆయన స్వయంగా తన ఇంటికి వచ్చి మరీ ఓదార్చిన తీరు ఇప్పటికీ తన కళ్లముందు కదలాడుతోందని... అలాంటి వ్యక్తి ఇప్పుడు మనమధ్యలో లేకపోవడం చాలా బాధాకరమని కోహ్లీ అన్నాడు.

ఇదే కార్యక్రమంలో అరుణ్ జైట్లీ స్టేడియంలో  ఓ స్టాండ్ కు కోహ్లీ పేరు పెట్టారు. ఈ కార్యక్రమంలో డిల్లీ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రజత్ శర్మతో పాటు ఇతర అధికారులు, బిసిసిఐ ప్రతినిధులతో పాటు అధికారులు పాల్గొన్నారు.