Asianet News TeluguAsianet News Telugu

దీప్తి శర్మ ఆల్ రౌండ్ షో.. తొలి వన్డేలో లంకపై టీమిండియా గెలుపు

IND-W vs SL-W: లంక పర్యటనలో ఉన్న టీమిండియా  వన్డే సిరీస్ ను విజయంతో ఆరంభించింది. ఇప్పటికే టీ20 సిరీస్ గెలిచిన భారత మహిళల జట్టు.. తొలి వన్డే నెగ్గింది. 
 

Deepthi Sharma All Round Show Helps Team India To Beat by 4 wickets Against Sri Lanka
Author
India, First Published Jul 1, 2022, 5:32 PM IST

శ్రీలంకను టీ20 లలో ఓడించిన భారత మహిళల జట్టు వన్డే సిరీస్ ను కూడా విజయంతో ప్రారంభించింది. పల్లెకెల వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత అమ్మాయిలు  శ్రీలంకను 4 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత లంకను బౌలింగ్ లో దెబ్బతీసిన భారత బౌలర్లు.. తర్వాత బ్యాటింగ్ లో సమిష్టిగా రాణించి విజయాన్ని అందుకున్నారు. టీమిండియా ఆల్  రౌండర్ దీప్తి శర్మ ఆల్ రౌండ్ షో తో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించింది. తొలుత శ్రీలంక 48.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ తర్వాత ఇండియా.. 38 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న  శ్రీలంక బ్యాటింగ్ లో విఫలమమైంది.  ఓపెనర్ హసిని పెరీరా (54 బంతుల్లో 37.. 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించింది. కానీ కెప్టెన్ చమరి ఆటపట్టు (2) తో పాటు హన్సిమా కరుణరత్నె (0)లు విఫలమయ్యారు. మాదవి (28) కూడా నిలదొక్కుకోలేదు. దీంతో లంక.. 65 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. 

ఆ తర్వాత నీలాక్షి డి సిల్వ (63 బంతుల్లో 43.. 4 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేసినా  ఆమెకు సహకరించేవారు లేకపోవడంతో లంక భారీ స్కోరు చేయలేకపోయింది. 48.2 ఓవర్లలో శ్రీలంక 171 పరుగులకే ఆలౌట్ అయింది.  భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ లు మూడు వికెట్లు తీశారు. పూజా వస్త్రకార్ 2 వికెట్లు తీయగా.. గైక్వాడ్, హర్మన్ ప్రీత్ కౌర్ తలో వికెట్ పడగొట్టారు. 

 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో భారత జట్టు.. ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయింది. స్మృతి మంధాన (4), యస్తికా భాటియా (1)  లు త్వరగానే  పెవిలియన్ చేరారు. 17 పరుగులకే 2 వికెట్లు కోల్పోవడంతో షఫాలీ వర్మ (35) ధాటిగా ఆడింది. ఆమెకు తోడుగా హర్మన్ ప్రీత్ కౌర్ (44), హలీన్ డియోల్ (34) లు ఆకట్టుకున్నారు.  ఆ తర్వాత దీప్తి శర్మ (22 నాటౌట్), పూజా వస్త్రకార్ (21 నాటౌట్) కూడా రాణించారు. దీంతో 38 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. బౌలింగ్ లో మూడు వికెట్లు తీసి బ్యాటింగ్ లో కూడా రాణించిన దీప్తి శర్మ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios