అనిశ్చితికి, అభిమానుల డోలాయమానాలకు తెరపడింది. నిరీక్షణ ముగిసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వార్త బీసీసీఐ వద్దకు రానే వచ్చింది. కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా 2020 టీ20 మెన్స్‌ వరల్డ్‌కప్‌ వాయిదా పడింది. 

ఈ మేరకు ఐసీసీ సోమవారం ప్రకటించింది. టెలీ కాన్ఫరెన్స్‌లో సమావేశమైన ఐసీసీ ఐబీసీ కమిటీ దీనిపై తుది నిర్ణయం తీసుకుంది. ' అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ ఈ రోజు ఐసీసీ మెన్స్‌ టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేసింది. కోవిడ్‌-19 మహమ్మారితో ఆస్ట్రేలియాలో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా పడింది' అని ఐసీసీ అధికారిక ప్రకటనలో తెలిపింది.దీనితో బీసీసీఐ నోట్లో పాలు పోసినట్లయింది. 

2020 మెన్స్‌ ఐసీసీ టీ20 వరల్డ్‌కప్‌ను వాయిదా వేస్తూ ఎట్టకేలకు ఐసీసీ నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ కారణంగా వరల్డ్‌ కప్‌కు ఆతిథ్యం ఇచ్చేందుకు సిద్ధంగా లేమని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) మే నెలలోనే నిర్ణయాన్ని ఐసీసీకి నివేదించింది. అయినా, ఐసీసీ రెండు నెలలుగా ఈ విషయాన్ని నాన్చుతూనే వచ్చింది. 

ఇంకా వీడని సస్పెన్స్... 

తాజాగా వాయిదా నిర్ణయం వెల్లడించినా ఇంకా అనిశ్చితి వాతావరణం కొనసాగుతూనే ఉంది. అక్టోబర్‌ 18-నవంబర్‌ 15, 2020 ఆస్ట్రేలియాలో జరగాల్సిన వరల్డ్‌కప్‌ వాయిదా పడింది. అయితే రానున్న 2021, 2022 టీ20 వరల్డ్‌కప్‌ల వేదికలపై ఐసీసీ ఇంకా తేల్చలేదు. 

ఒరిజనల్‌ షెడ్యూల్‌ ప్రకారం 2021 టీ20 వరల్డ్‌కప్‌కు భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. తాజాగా విడుదల చేసిన షెడ్యూల్‌లో 2023 వన్డే వరల్డ్‌కప్‌ తేదిలను సైతం ఐసీసీ మార్పు చేసింది. అర్హత టోర్నీలకు మరింత సమయం ఇచ్చేందుకు మార్చి-ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌-నవంబర్‌కు మార్చివేసింది. 

2023 వన్డే వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నవంబర్‌ 26న జరుగనుండగా.. 2021 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నవంబర్‌ 14, 2022 టీ20 వరల్డ్‌కప్‌ ఫైనల్‌ నవంబర్‌ 13న జరుగనున్నాయి. 2023 వన్డే వరల్డ్‌కప్‌ వేదికను భారత్‌ అని పేర్కొన్న ఐసీసీ.. 2021, 2022 టీ20 వరల్డ్‌కప్‌ వేదికలను పేర్కొనలేదు.

2020 టీ20 ఆతిథ్య అవకాశం కోల్పోయిన క్రికెట్‌ ఆస్ట్రేలియా అదే షెడ్యూల్‌తో 2021లో నిర్వహించే అవకాశం ఇవ్వాలని కోరింది. భారత్‌ ఆతిథ్యం ఇవ్వాల్సిన టీ20 వరల్డ్‌కప్‌ను 2022కు కేటాయించాలని విన్నవించింది. 

ఆరు నెలల విరామంలో రెండు వరల్డ్‌కప్‌లను ఆతిథ్యం ఇచ్చేందుకు బీసీసీఐ సుముఖత వ్యక్తం చేయలేదని తెలిసింది. దీంతో వేదికల నిర్ణయాన్ని విస్తృత సంప్రదింపుల అనంతరం ప్రకటించే వీలుంది.

ఐపీఎల్ పట్టాలెక్కడమే...!

2020 టీ20 వరల్డ్‌కప్‌ వాయిదా నిర్ణయం కోసం ఎదురుచూసిన బీసీసీఐ ఇక ఐపీఎల్‌ 13ను అధికారికంగా పట్టాలెక్కించనుంది. ఐసీసీ ఎఫ్‌టీపీ అడ్డు తొలగినా.. భారత్‌కు మరో సవాల్‌ ఎదురు కానుంది. 

ఐపీఎల్‌ 2020ని యుఏఈలో నిర్వహించేందుకు బోర్డు ఆసక్తి చూపిస్తోంది. సెప్టెంబర్‌ 26న తొలి మ్యాచ్‌తో తాత్కాలిక షెడ్యూల్‌ సైతం రూపొందించింది. అయితే, విదేశాల్లో ఐపీఎల్‌కు కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. 

ఐసీసీ క్లియరెన్స్‌ లభించిన ఐపీఎల్‌ ఇప్పుడు ప్రభుత్వ అనుమతులు లభించాల్సి ఉంది. ప్రభుత్వ అనుమతులు లభించిన వెంటనే యుఏఈలో క్రికెటర్ల శిక్షణ శిబిరాన్ని బీసీసీఐ ఏర్పాట్లు చేయనుంది.