Dean Elgar Warning: జాతీయ జట్టును కాదని కాసులు కురిపిస్తున్న  ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై ఆ జట్టు సారథి డీన్ ఎల్గర్ కన్నెర్ర జేశాడు. ఆ ఆటగాళ్లకు  ఇక జట్టులో చోటు దొరకడం కష్టమేనని వార్నింగ్ ఇచ్చాడు. 

దేశం కోసం ఆడకుండా, జాతీయ జట్టు బాధ్యతలు విస్మరించి కాసుల కోసం ఐపీఎల్ కు వచ్చి ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లకు సారథి డీన్ ఎల్గర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. వాళ్లు ఇకపై సౌతాఫ్రికా జాతీయ జట్టుకు ఎంపికవడం కష్టమేనని చెప్పకనే చెప్పాడు. బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఉన్నా.. ఐపీఎల్ కాంట్రాక్టుల కోసం ఇండియాకు వచ్చిన ఆటగాళ్లపై సారథి డీన్ ఎల్గర్ తో పాటు ఆ జట్టు కోచ్ మార్క్ బౌచర్ కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ సందర్బంగా అతడు కూడా ఈ ఆటగాళ్లకు రాబోయే రోజుల్లో అవకాశాలు రావడం కష్టమేనని తేల్చాడు.

ఐపీఎల్ లో వివిధ ఫ్రాంచైజీల తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో... కగిసో రబాడా, లుంగీ ఎంగిడి, రస్సీ వన్ డర్ డసెన్, ఏయిడెన్ మార్క్రమ్, జాన్సేన్, డేవిడ్ మిల్లర్, ఆన్రిచ్ నోర్త్జ్ వంటి వాళ్లున్నారు. క్వింటన్ డికాక్ లక్నో తరఫున ఆడుతున్నా అతడు టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు.

కాగా.. ఐపీఎల్ ప్రారంభ సమయంలోనే బంగ్లాదేశ్ జట్టు దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది. అక్కడ మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు కూడా ఆడేందుకు వెళ్లింది. అయితే అప్పటికే ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఇక్కడి ఫ్రాంచైజీలతో కాంట్రాక్టులు ఉన్న ఆటగాళ్లంతా బంగ్లాదేశ్ తో సిరీస్ ను కాదనుకుని మరి ఇండియాకు వచ్చారు. దీనిపై గతంలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డీన్ ఎల్గర్ తాజాగా మరింత ఘాటుగా స్పందించాడు. 

నా చేతుల్లో ఏమీ లేదు.. 

బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ అనంతరం ఎల్గర్ మాట్లాడుతూ... ‘మీరు (ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్లను ఉద్దేశించి) మళ్లీ సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కించుకుంటారనే దానిపై నాకైతే నమ్మకం లేదు. అది నా చేతుల్లో కూడా లేదు..’ అని నర్మగర్భ వ్యాఖ్యలు చేశాడు. మార్క్ బౌచర్ కూడా ఇదే తరహా అభిప్రాయం వ్యక్తం చేశాడు. 

బంగ్లాదేశ్ తో కూడా మేమే ఆడాలా...? 

ఐపీఎల్ ప్రారంభానికి ముందు కూడా డీన్ ఎల్గర్ స్పందిస్తూ.. ఇది తమ ఆటగాళ్ల నిబద్దతకు సంబంధించిన విషయమని, వాళ్లు జాతీయ జట్టును ఎంపిక చేసుకుంటారా..? డబ్బుల కోసం వెళ్తారా..? అనేది ఆటగాళ్లే నిర్ణయించుకుంటారని చెప్పిన విషయం తెలిసిందే. తన అభిప్రాయం మేరకు దక్షిణాఫ్రికా టెస్టు జట్టులో ఉన్న (రబాడా, మార్క్రమ్, జాన్సేన్, డసెన్, నోర్త్జ్) ఆటగాళ్లెవరూ జాతీయ జట్టును వీడరనే నమ్మకం తనకుందని ఎల్గర్ చెప్పాడు. కానీ కెప్టెన్ నమ్మకాన్ని వమ్ము చేస్తూ.. ‘బంగ్లాదేశ్ తో సిరీస్ కు కూడా మేము ఆడాలా..? రెండో జట్టుతో ఆడించుకోండి..’ అని పైన పేర్కొన్న ఆటగాళ్లంతా ముంబై విమానమెక్కారు. దీంతో దక్షిణాఫ్రికా.. అనామక ఆటగాళ్లతోనే బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ ఆడి 2-0తో సిరీస్ ను గెలుచుకుంది. 

మరి ఎల్గర్, బౌచర్ అసంతృప్తిని క్రికెట్ దక్షిణాఫ్రికా ఏమేరకు పట్టించుకుంటుంది..? జాతీయ జట్టును కాదని ఐపీఎల్ ఆడుతున్న ఆటగాళ్లపై ఏ మేరకు చర్యలు తీసుకుంటుందనేది ఆసక్తికరం.. ఒకవేళ సీఎస్ఏ కూడా కెప్టెన్, కోచ్ ల బాధను పరిగణనలోకి తీసుకుంటే ఐపీఎల్ ఆడుతున్న దక్షిణాఫ్రికా క్రికెటర్ల కెరీర్ లకు చరమగీతం పాడినట్టే...!