DC vs LSG Highlights : లక్నోను దెబ్బకొట్టిన కుల్దీప్.. అదరగొట్టిన జేక్ ఫ్రేజర్.. ఢిల్లీ గెలుపు
DC vs LSG Highlights : ఐపీఎల్ 2024 లో 26వ మ్యాచ్ లో ఢిల్లీ-లక్నోలు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ తో అదరగొట్టగా, జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్ బ్యాట్ ఇరగదీశాడు. దీంతో లక్నో పై ఢిల్లీ విజయం సాధించింది.
Delhi Capitals vs Lucknow Supergiants Highlights : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) 26వ మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో తలపడ్డాయి. లక్నోలోని బీఆర్ఎస్ఏబీవీ ఎకానా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో బౌలింగ్, బ్యాటింగ్ లో రాణించిన ఢిల్లీ ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది. దీంతో పాయింట్ల టేబుల్ లో చివరి స్థానం నుంచి ఒక మెట్టు పైకి వచ్చింది. టాస్ గెలిచిన లక్నో బ్యాటింగ్ ఎంచుకుంది. అందుకు తగ్గట్టుగానే ఓపెనర్లుగా కేఎల్ రాహుల్, క్వింటన్ డి కాక్ ఇద్దరూ ధనాధన్ గేమ్ ఆడారు. కానీ పెద్ద ఇన్నింగ్స్ గా వాటిని మార్చలేకపోయారు. క్వింటన్ డి కాక్ 19 పరుగులు వద్ద ఔట్ కాగా, తర్వాత వచ్చిన దేవదత్ పడిక్కల్ 3 పరుగులకే పెవిలియన్ కు చేరాడు.
ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్‌ను కుల్దీప్ యాదవ్ 8 పరుగుల వద్ద అవుట్ చేశాడు. నికోలస్ పూరన్ వచ్చిన వెంటనే పరుగులేమి చేయకుండానే క్లీన్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. దీపక్ 10 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఇలా లక్నో మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ స్వల్ప పరుగులకే ఔట్ కావడంతో 100 పరుగులైనా పూర్తి చేస్తుందా అనే ప్రశ్నలు వచ్చాయి. కేఎల్ రాహుల్ 39 పరుగుల వద్ద ఔటయ్యాడు. లక్నో సూపర్‌జెయింట్స్ 12.6 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 97 పరుగులకే కుప్పకూలింది. అయితే, చివరలో ఆయూష్ బదోని 5 ఫోర్లు, ఒక సిక్సర్ తో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడి 35 బంతుల్లో 55 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో అర్షద్ ఖాన్ 20 పరుగుల ఇన్నింగ్స్ ఆడటంతో లక్నో టీమ్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నాడు. ఇషాత్ శర్మ, ముఖేష్ కుమార్ లు చెరో వికెట్ తీసుకున్నారు.
తొలి మ్యాచ్ తోనే తోపు అనిపించుకున్నాడు..
168 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ కు పవర్ ప్లేలో మంచి స్కోర్ లభించింది. కానీ కీలకమైన వికెట్లను కోల్పోయింది. డేవిడ్ వార్నర్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 8 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. పృథ్వీ షా 32 పరుగులు చేశాడు. అయితే, ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇచ్చిన జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్.. అదిరిపోయే ఆరంభంతో దుమ్మురేపాడు. ధనాధన్ ఇన్నింగ్స్ తో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 55 పరుగులు కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 4 ఫోర్లు, 2 సిక్సర్లతో రిషబ్ పంత్ మరోసారి కెప్టెన్ ఇన్నింగ్స్ తో మెరిశాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్లు కోల్పోయి 18.1 ఓవర్లలోనే 170 పరుగులు చేసి ఈ సీజన్ లో రెండో విజయాన్ని అందుకుంది.
DC VS LSG : కుల్దీప్ యాదవ్ కుమ్మెశాడు.. అదరగొట్టిన ఢిల్లీ బౌలర్లు.. కానీ..