ఐపీఎల్ 2016 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్... ఐపీఎల్ 2022 మెగా వేలంలో వార్నర్‌ని కొనుగోలు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 

రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడడంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. రెండు సీజన్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌కి కెప్టెన్‌గా ఉన్నాడు రిషబ్ పంత్. అతని గైర్హజరీతో కొత్త కెప్టెన్‌ని ఎంచుకునే పనిలో పడింది ఢిల్లీ క్యాపిటల్స్. ఆ టీమ్‌లో ఉన్న సీనియర్ ప్లేయర్ డేవిడ్ వార్నర్‌కే ఢిల్లీ క్యాపిటల్స్, ఐపీఎల్ 2023 సీజన్ కెప్టెన్సీ దక్కనుందని సమాచారం..

కెప్టెన్‌గా సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి 2016లో టైటిల్ అందించాడు డేవిడ్ వార్నర్. వార్నర్ కెప్టెన్సీలో నాలుగు సార్లు నాకౌట్ స్టేజీకి కూడా అర్హత సాధించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. ఐపీఎల్ 2021 సీజన్ సమయంలో టీమ్ మేనేజ్‌మెంట్‌తో విభేదాల కారణంగా డేవిడ్ వార్నర్ కెప్టెన్సీ కోల్పోయి, 2022 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కి వచ్చాడు...

ఐపీఎల్ 2013 నుంచ ప్రతీ సీజన్‌లోనూ 400లకు పైగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, 2021 సీజన్‌లో మాత్రం 8 మ్యాచులు ఆడి 195 పరుగులు చేయగలిగాడు. ఆ సీజన్‌లో టీమ్‌ మేనేజ్‌మెంట్‌తో తలెత్తిన విభేదాలు, అనవసర వివాదాలు అతని ఆటను ప్రభావితం చేశాయి..

ఆ తర్వాత 2022 సీజన్‌లో 12 మ్యాచులు ఆడిన డేవిడ్ వార్నర్, ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ తరుపున 432 పరుగులు చేసి మళ్లీ తన పాత ఫామ్‌ని నిరూపించుకున్నాడు. దీంతో డేవిడ్ వార్నర్‌కి కెప్టెన్సీ ఇవ్వడమే కరెక్ట్ నిర్ణయమని ఢిల్లీ క్యాపిటిల్స్ టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది..

ఇప్పటికే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఫాఫ్ డుప్లిసిస్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి అయిడిన్ మార్క్‌రమ్.. ఐపీఎల్ 2023 సీజన్‌లో కెప్టెన్లుగా వ్యవహరించబోతున్నారు. డేవిడ్ వార్నర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో మూడో విదేశీ కెప్టెన్‌గా నిలవబోతున్నాడు...

ఐపీఎల్‌‌ కెరీర్‌లో 162 మ్యాచులు ఆడిన డేవిడ్ వార్నర్, 5881 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో టాప్ 5లో ఉన్న డేవిడ్ వార్నర్, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో రెండో టెస్టులో గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తున్న సమయంలో మహ్మద్ సిరాజ్ వేసిన బౌన్సర్, డేవిడ్ వార్నర్ భుజానికి బలంగా తాకింది. ఈ గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలో దిగని వార్నర్, చివరి రెండు టెస్టులకు దూరమయ్యాడు..

అయితే టెస్టు సిరీస్ సిరీస్ ముగిసిన తర్వాత జరిగే వన్డే సిరీస్‌లో పాల్గొనే డేవిడ్ వార్నర్, ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి అందుబాటులో ఉంటాడని ఆశిస్తోంది ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్. కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రిషబ్ పంత్, పూర్తిగా కోలుకుని రీఎంట్రీ ఇవ్వడానికి కనీసం ఆరు నుంచి ఏడు నెలల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు అభిమానులు.. 

ఐపీఎల్ 2023 సీజన్‌లో అక్షర్ పటేల్, ఢిల్లీ క్యాపిటల్స్‌కి వైస్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్‌లో ఉన్న ముంబై యంగ్ కెప్టెన్ పృథ్వీ షాకి కెప్టెన్సీ దక్కవచ్చని చాలామంది క్రికెట్ ఫ్యాన్స్ ఆశించారు. అండర్9 వన్డే వరల్డ్ కప్ 2018 టైటిల్ గెలిచిన భారత జట్టుకి కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు పృథ్వీ షా. అయితే అతని నిలకడ లేమి కారణంగా పృథ్వీ షాకి కెప్టెన్సీ అప్పగించడానికి ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ ఇష్టపడలేదని సమాచారం.