కరోనా వైరస్‌ మహమ్మారితో ప్రపంచ క్రికెట్‌ మూడు నెలలుకు పైగా నిలిచిపోయింది. బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణంలో ఇప్పుడిప్పుడే ప్రపంచ క్రికెట్‌ పునః ప్రారంభం అవుతోంది. కరోనా తీసుకొచ్చిన ప్రమాదంతో ఎన్నో విధాలుగా రాజీపడి క్రికెట్‌ మైదానంలోకి ప్రవేశించింది. 

దీంతో క్రికెటర్లతో పాటు అభిమానులు సంతోషిస్తున్నారు. కరోనా సమయంలో క్రికెట్‌ సిరీస్‌లు బయో సెక్యూర్‌ బబుల్‌లోనే జరుగుతున్నాయి. ఈ పరిణామంతో క్రికెటర్లు నెలలుగా కుటుంబాలకు దూరం కావాల్సి వస్తోంది. 

ఒత్తిడితో కూడుకున్న అంతర్జాతీయ కెరీర్‌లో ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎక్కువ ఇష్టపడతారు. కానీ బయో సెక్యూర్‌ బబుల్‌ (బుడగ) వాతావరణంలో క్రికెటర్ల కుటుంబ సభ్యులకు ప్రవేశం లేదు. 

ఈ అంశం పలువురు క్రికెటర్లను వీడ్కోలు దిశగా తీసుకెళ్లే ప్రమాదం కనిపిస్తోంది. వరుస సిరీస్‌లు ఆడాల్సిన నేపథ్యంలో నెలలుగా కుటుంబానికి దూరంగా ఉండటం ఎంతో కష్టం. ఇదే విషయాన్ని ఆస్ట్రేలియా స్టార్‌ బ్యాట్స్‌మన్‌ డెవిడ్‌ వార్నర్‌ అంటున్నాడు. కోవిడ్‌-19 తరుణంలో ఇంగ్లాండ్‌తో సిరీస్‌, ఐపీఎల్‌ 2020, భారత్‌తో సిరీస్‌లపై వాస్తవిక అంశాలను వార్నర్‌ స్పృశించాడు.

తనకు ముగ్గురు కూతుళ్లు, భార్య ఉన్నారని, వారికి తాను ఎంతో చేయాల్సి ఉంటుందని, తన క్రికెట్‌ కెరీర్‌లోనే వారిది సింహభాగం అని వార్నర్ అన్నాడు. మనం ఎప్పుడైనా కుటుంబానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, క్రికెట్‌, ఇతర అవాంఛిత అంశాలతో కూడిన సమయంలో మన నిర్ణయాలను ఆచిచూచి తీసుకోవాల్సి ఉంటుందని ఎదిర్నేర్ అభిప్రాయపడ్డాడు. 

ఈ ఏడాది టీ20 వరల్డ్‌కప్‌ ఆస్ట్రేలియాలో జరగటం లేదని. ఇప్పుడది వాయిదా వేయబడిందని, భారత్‌లో టీ20 వరల్డ్‌కప్‌ సమయానికి తాను పునరాలోచన చేయాల్సి ఉంటుందని, పిల్లల స్కూలు వారి బాగోగులు వంటి విషయాలు తన కెరీర్‌ను ప్రభావితం చేయనున్నాయని అన్నాడు వార్నర్. 

కేవలం క్రికెట్ గురించి మాత్రమే కాదు, తన వరకు ఇది ఒక కుటుంబ నిర్ణయం అని వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ కోసం బయో సెక్యూర్‌ బబుల్‌తో కుటుంబాలకు అనుమతి ఉండకపోవడం వల్ల సుదీర్ఘకాలం కుటుంబానికి దూరంగా ఉండాల్సి రావచ్చని, వెళ్లినచోటకి కుటుంబాన్ని తీసుకెళ్లే వీలుండదని వార్నర్ వ్యాఖ్యానించాడు.