వచ్చే జనవరిలో పాకిస్తాన్‌పై ఆఖరి టెస్టు ఆడబోతున్న డేవిడ్ వార్నర్... 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుబోతున్నట్టు ప్రకటించిన డేవిడ్ వార్నర్..
పేరుకి ఆస్ట్రేలియా క్రికెటర్ అయినా డేవిడ్ వార్నర్‌కి ఇక్కడే ఫాలోయింగ్, క్రేజ్ ఎక్కువ. ఐపీఎల్ ద్వారా వెలుగులోకి వచ్చి, అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న డేవిడ్ వార్నర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా తెలుగువారికి బాగా దగ్గరయ్యాడు. టిక్ టాక్ వీడియోలు, ఫన్నీ ఫేస్ మార్ఫింగ్ వీడియోలతో భారతీయులకు చేరువైన డేవిడ్ వార్నర్, త్వరలో రిటైర్మెంట్ ప్రకటించబోతున్నట్టు సమాచారం...
టీమిండియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కోసం సిద్ధమవుతున్న డేవిడ్ వార్నర్, వచ్చే సమ్మర్ సీజన్‌తో టెస్టు ఫార్మాట్ నుంచి తప్పుకోబోతున్నట్టు సమాచారం. వచ్చే జనవరిలో పాకిస్తాన్‌తో సిడ్నీ వేదికగా జరిగే టెస్టు మ్యాచ్, డేవిడ్ వార్నర్ కెరీర్‌లో ఆఖరి టెస్టు కావచ్చని సమాచారం..
36 ఏళ్ల డేవిడ్ వార్నర్, 2024 టీ20 వరల్డ్ కప్‌తో పూర్తిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు. ‘ఇప్పుడైతే నేను బాగానే పరుగులు చేస్తున్నా. అయితే వన్డే వరల్డ్ కప్ 2024 టోర్నీలో నా ఫైనల్ మ్యాచ్ అవుతుందని ముందుగానే చెప్పాను... ఈ విషయంలో నా కుటుంబానికి కూడా మాటిచ్చాను..
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో, యాషెస్ సిరీస్‌లో పరుగులు చేయగలిగితే కచ్చితంగా ఆస్ట్రేలియాలో పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్ ఆడతాను. అయితే ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్ మాత్రం ఆడనని కచ్ఛితంగా చెప్పగలను. ఒకవేళ డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఫెయిల్ అయితే పాకిస్తాన్‌తో సిరీస్ దాకా ఉంటానో కూడా లేదో కూడా చెప్పలేను...’ అంటూ కామెంట్ చేశాడు డేవిడ్ వార్నర్...
టీమిండియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది ఆస్ట్రేలియా. అయితే 2019 యాషెస్ సిరీస్‌లో డేవిడ్ వార్నర్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. 10 కంటే తక్కువ యావరేజ్‌తో పరుగులు చేశాడు..
అయితే ఐపీఎల్ 2023 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున టాప్ స్కోరర్‌గా నిలిచిన డేవిడ్ వార్నర్, 14 మ్యాచుల్లో 516 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. ఐపీఎల్‌లో అత్యధిక సీజన్లలో 500+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా నిలిచిన డేవిడ్ వార్నర్, 2023 సీజన్‌లో 6 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు..
తన కెరీర్‌లో 102 టెస్టులు ఆడి 45.58 సగటుతో 8158 పరుగులు చేసిన డేవిడ్ వార్నర్, తన కెరీర్‌లో 25 సెంచరీలు బాదాడు. ఇందులో 3 డబుల్ సెంచరీలు, ఓ త్రిబుల్ సెంచరీ కూడా ఉంది. బౌలింగ్‌లోనూ 4 వికెట్లు తీసిన డేవిడ్ వార్నర్.. కొంతకాలంగా గాయాలతో బాధపడుతున్నాడు..
స్టీవ్ స్మిత్ ఆస్ట్రేలియాకి టెస్టు కెప్టెన్‌గా ఉన్న సమయంలో డేవిడ్ వార్నర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో సాండ్ పేపర్ బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ ఇద్దరిపై వేటు పడింది. ఇద్దరిపై ఏడాది బ్యాన్ వేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. డేవిడ్ వార్నర్ జీవితంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టకుండా జీవితకాల నిషేధం విధించింది..
9 నెలల క్రితం ఈ లైఫ్ టైం కెప్టెన్సీ బ్యాన్ ఎత్తివేయాల్సిందిగా క్రికెట్ ఆస్ట్రేలియాని కోరాడు డేవిడ్ వార్నర్. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా మాత్రం ఈ విషయంలో సరిగ్గా స్పందించడం లేదు.
షేన్ వాట్సన్ గాయపడడంతో అతని స్థానంలో 2011లో న్యూజిలాండ్‌తో టెస్టు ద్వారా టెస్టు ఆరంగ్రేటం చేసిన డేవిడ్ వార్నర్, మొదటి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో 3 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన డేవిడ్ వార్నర్, న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో సెంచరీ చేసి తన ప్లేస్‌ని ఫిక్స్ చేసుకున్నాడు..