బిగ్‌బాష్ లీగ్ 2020 సీజన్‌లో సిడ్నీ సిక్సర్స్ జట్టు రికార్డు విజయాన్ని అందుకుంది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్‌త జరిగిన మ్యాచ్‌లో 145 పరుగుల భారీ తేడాతో గెలిచిన సిడ్నీ సిక్సర్స్, బీబీఎల్ చరిత్రలోనే అతి పెద్ద విజయాన్ని నమోదుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది.

యంగ్ బ్యాట్స్‌మెన్ జోష్ ఫిలిప్ 57 బంతుల్లో 95 పరుగులు చేయగా... జోర్డన్ సిల్క్స్ 19 బంతుల్లో 45 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 206 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన మెల్‌బోర్న్ జట్టు... ఏ దశలోనూ లక్ష్యంవైపు సాగుతున్నట్టు కనిపించలేదు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ రెండో ఓవర్‌లోనే అవుట్ కాగా... వరుస వికెట్లు కోల్పోయి 10.4 ఓవర్లలో 60 పరుగులకే కుప్పకూలింది.

కేవలం ఇద్దరు బ్యాట్స్‌మన్ మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు అందుకోగా ముగ్గురు డకౌట్ అయ్యారు. దీనిపై స్పందించిన ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్... ‘ఇప్పుడే స్క్రీన్ కింద చూశాను... 43/9 చూసి షాక్ అయ్యాను... ఇదే టైమ్ అనుకుంటా...’ అంటూ ట్వీట్ చేశాడు వార్నర్.