ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ప్రాంఛైజీకి డారెన్‌ సామి 2013, 2014లో ప్రాతినిథ్యం వహించిన డారెన్ సామి చివరగా 2017లో కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ తరఫున ఐపీఎల్‌లో ఆడాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తరఫున ఆడిన సమయంలో శ్రీలంక క్రికెటర్‌ తిలకరత్నె దిల్షాన్‌, తనను (డారెన్‌ సామీ) అందరూ 'కాలూ' అని సంభోదిస్తూ పిలిచేవారని డారెన్‌ సామీ తాజాగా సోషల్‌ మీడియాలో పేర్కొన్నాడు. 

'కాలూ పదానికి అర్థం ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను. ఐపీఎల్‌కు ఆడుతున్న సమయంలో తిలకరత్నె దిల్షాన్‌ను, నన్ను ఈ పేరుతో పిలిచేవారు. అప్పట్లో బలవంతుడు, శక్తిమంతుడు అనే భావం వస్తుందని పిలిచేవారని అనుకున్నాను' అని సామీ సోషల్‌ మీడియాలో రాసుకొచ్చారు. కాలూ అంటే హిందీలో నల్లనివాడు అని అర్థం. 

దక్షిణాదిలోనూ దీనికి అదే అర్థం వస్తుంది. సంస్కృతంలో నలుపు రంగను కాలా అని అంటారు. చర్మం రంగు పేరుతో ఓ వ్యక్తిని పిలువటం అంటే వివక్ష చూపించటమే అవుతుంది. భారత నేరా శిక్షాస్మృతి ప్రకారం సైతం ఇది నేరమే.

2013, 2014 సీజన్లలో జరిగిన సంఘటన పట్ల డారెన్‌ సామీ ఇప్పుడు స్పందించటం ఏమీటనే వింత వాదన సోషల్‌ మీడియాలో వినిపిస్తోంది. అతడు అప్పుడే స్పందించవచ్చు కదా అని లాజిక్‌లు తీస్తున్నారు. 

ఓ విదేశీ క్రికెటర్‌కు హిందీ భాషలో ఓ వర్ణం వారిని పిలిచే పదం అర్థం ఏ విధంగా తెలుస్తుందో వారికే తెలియాలి. 'కాలూ' అనే పదం పట్ల ఇప్పుడు ఆగ్రహం రావటానికి గల కారణాలను డారెన్‌ సామీ తాజాగా వివరించాడు. 

అమెరికాకు చెందిన కమెడియన్‌ హసన్‌ మిన్హాజ్‌ షో చూసిన తర్వాత కాలూ పదం అర్థం తెలిసినట్టు చెప్పాడు. ' హసన్‌ మిన్హాజ్‌ టాకింగ్‌ షో చూస్తున్నడు ఈ విషయం అర్థమైంది. హిందీ ప్రజల సంస్కృతిలో నలుపు వర్ణ వ్యక్తులను ఏ విధంగా సంబోధిస్తారో చెప్పాడు. అలా ఇది హిందీ ప్రజలకు అందరికీ వర్తించదు. నన్ను ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ సహచరులు ఆ పేరుతోనే పిలిచారని అప్పుడు గుర్తుకొచ్చింది. వెంటనే ఎంతో కోపం వచ్చింది. మరెంతో బాధ కలిగింది' అని డారెన్‌ సామీ తెలిపాడు.

2013, 2014 సీజన్లలో వర్ణ వివక్ష ఎదుర్కొన్నప్పుడు అప్పుడే రిపోర్ట్‌ చేయాల్సింది. ఇప్పుడు చెబితే ఏం చేయగలమనే ధోరణిలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఉంది. డారెన్‌ సామీ పేర్లతో సహా బయటకు రాకముందే సన్‌రైజర్స్‌లో సామీ మాజీ సహచరులు, బీసీసీఐ, సన్‌రైజర్స్‌ యాజమాన్యం వర్ణ వివక్ష వ్యాఖ్యల పట్ల వివరణ ఇస్తే హుందాగా ఉంటుంది. లేదంటే ఐపీఎల్‌పై వర్ణ వివక్ష మాయని మచ్చలా ఉండిపోవటం ఖాయం!.