వరుసగా నాలుగో సీజన్‌లోనూ హెడ్ కోచ్‌ని మార్చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్... బ్రియాన్ లారా ప్లేస్‌లో డానియల్ వెట్టోరీకి బాధ్యతలు.. 

ఐపీఎల్ 2024 సీజన్‌కి ముందు టైటిల్ గెలవలేకపోయిన ఫ్రాంఛైజీలన్నీ కోచ్‌లను మార్చే పనిలో పడ్డాయి. ఆర్‌సీబీ కొత్త కోచ్‌గా ఆండీ ఫ్లవర్ బాధ్యతలు తీసుకోగా లక్నో సూపర్ జెయింట్స్ హెడ్ కోచ్‌గా జస్టిన్ లాంగర్ బాధ్యతలు తీసుకున్నాడు. తాజాగా సన్‌రైజర్స్ హైదరాబాద్ కూడా హెడ్ కోచ్‌ని మారుస్తూ నిర్ణయం తీసుకుంది..

న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, మాజీ ఆల్‌రౌండర్ డేనియల్ వెట్టోరీని హెడ్ కోచ్‌గా నియమించింది సన్‌రైజర్స్ హైదరాబాద్. డానియల్ వెట్టోరీకి స్వాగతం పలికిన ఆరెంజ్ ఆర్మీ, బ్రియాన్ లారాకి వీడ్కోలు తెలిపింది. ‘బ్రియాన్ లారాతో రెండేళ్ల అనుబంధం ముగిసింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి మీరు చేసిన సేవలకు థ్యాంక్యూ..’ అని రాసుకొచ్చింది ఎస్‌ఆర్‌హెచ్.. 

Scroll to load tweet…

డేనియల్ వెట్టోరీ ఇంతకుముందు 2014 నుంచి 2018 వరకూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి హెడ్ కోచ్‌గా వ్యవహరించాడు. 2016లో డేనియల్ వెట్టోరీ కోచింగ్‌లోనే ఫైనల్‌కి చేరింది రాయల్ ఛాలెంజర్స్. 2016 ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్‌సీబీని ఓడించి, మొట్టమొదటి టైటిల్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి 2024 సీజన్‌లో కోచ్‌గా వ్యవహరించబోతున్నాడు డేనియల్ వెట్టోరీ.. 

యాషెస్ సిరీస్ 2023 సిరీస్ సమయంలో ఆస్ట్రేలియా క్రికెట్ టీమ్‌కి అసిస్టెంట్ కోచ్‌గానూ వ్యవహరించాడు డేనియల్ వెట్టోరీ. 1997 నుంచి 2015 వరకూ అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగిన డేనియల్ వెట్టోరీ, 113 టెస్టులు, 295 వన్డే మ్యాచులు ఆడి 6784 పరుగులు చేశాడు, ఇందులో 6 టెస్టు సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే బౌలింగ్‌లో 671 వికెట్లు పడగొట్టాడు.. నాలుగేళ్ల పాటు న్యూజిలాండ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు వెట్టోరి.. 

గత సీజన్‌లో బ్రియాన్ లారా కోచింగ్‌లో ఆడింది సన్‌రైజర్స్ హైదరాబాద్. భారీ అంచనాలతో ఐపీఎల్ 2023 సీజన్‌ని ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ, 14 మ్యాచుల్లో 4 విజయాలు అందుకుని, పాయింట్ల పట్టికలో ఆఖరి పొజిషన్‌లో నిలిచింది. గత నాలుగు సీజన్లలో నలుగురు హెడ్ కోచ్‌లను మార్చింది సన్‌రైజర్స్ హైదరాబాద్..

2021 సీజన్‌లో ట్రేవర్ బేలిస్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తే, 2022 సీజన్‌లో టామ్ మూడీ కోచ్‌ పొజిషన్‌ని చేపట్టాడు. 2023 సీజన్‌లో బ్రియాన్ లారా, ఇప్పుడు డేనియల్ వెట్టోరీ... నాలుగు సీజన్లలో నలుగురు హెడ్ కోచ్‌లను మార్చిన ఏకైక ఐపీఎల్ టీమ్‌గా నిలిచింది సన్‌రైజర్స్ హైదరాబాద్..


2021-23 మధ్య మూడు సీజన్లలో రెండు సార్లు ఆఖరి పొజిషన్‌లో నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్, 2022 సీజన్‌లో 14 మ్యాచుల్లో 6 విజయాలు అందుకుని 8వ స్థానంలో నిలిచింది. వరుసగా 5 మ్యాచుల్లో నెగ్గిన తర్వాత వరుసగా 6 మ్యాచుల్లో ఓడి ప్లేఆఫ్స్ చేరలేకపోయింది ఆరెంజ్ ఆర్మీ..