ఈస్ట్ లండన్ (దక్షిణాఫ్రికా): ఇంగ్లాండుతో మూడు టీ20 మ్యాచుల సిరీస్ లో భాగంగా జరిగిన తొలి మ్యాచులో దక్షిణాప్రికా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. అదే సమయంలో దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు. దాదాపు ఏడాది తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆయన ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. 

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తమ ముందు ఉంచిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండు 9 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. దీంతో ఒక్క పరుగు తేడాతో పరాజయం పాలైంది. దక్షిణాఫ్రికా విజయంలో లుంగి ఎంగిడి కీలక పాత్ర పోషించాడు. మూడు వికెట్లు సాధించి సఫారీల విజయానికి తోడ్పడ్డాడు.

చివరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచులో స్టెయిన్ టీ20ల్లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు సాధించిన బౌలరుగా రికార్డు నెలకొల్పాడు. తద్వారా స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లాండుతో జరిగిన ఈ మ్యాచులో జోస్ బట్లర్ ను అవుట్ చేయడం ద్వారా ఈ రికార్డును స్థాపించాడు. అతను దాంతో 62 వికెట్లు తీశాడు. తద్వారా తాహిర్ తీసిన 61 వికెట్ల రికార్డును బ్రేక్ చేశాడు.

మొత్తంగా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు శ్రీలంక బౌలర్ లసిత్ మలింగ పేరు మీద ఉంది. మలింగ ఇప్పటి వరకు 106  వికెట్లు తీశాడు.  ఆ తర్వాతి స్థానాల్లో షాహిద్ అఫ్రిదీ (96), షకీబ్ అల్ హసన్ (92), ఉమర్ గుల్ (85) ఉన్నారు.