ఆస్ట్రేలియా చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు... ఆఖరి ఓవర్‌లో గెలిచి, సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకున్న ఆస్ట్రేలియా... భారత జట్టుకి కీలకంగా మారిన మిగిలిన మ్యాచులు... 

ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు... వెస్టిండీస్ చేసినట్టు భారత బౌలర్లు కూడా ఒకటి, రెండు వికెట్లు తీసి టీమిండియాకి ఉత్కంఠ విజయం అందిస్తారేమోననే ఆశలు రేగాయి. అయితే విండీస్ చేసిన మ్యాజిక్, భారత జట్టు చేయలేకపోయింది. ఆఖర్లో ఉత్కంఠ రేగినా, వరుసగా ఐదో విజయాన్ని అందుకున్న ఆస్ట్రేలియా... సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది...

తప్పక గెలవాల్సిన మ్యాచుల్లో ఆస్ట్రేలియా చేతుల్లో 6 వికెట్ల తేడాతో ఓడిన భారత జట్టు, ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. . మార్చి 22న బంగ్లాదేశ్‌తో, మార్చి 27న సౌతాఫ్రికాతో జరగాల్సిన మ్యాచుల్లో భారీ తేడాతో గెలవాల్సిన పరిస్థితుల్లో పడింది టీమిండియా...

వుమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో ఆఖరి ఓవర్‌లో విజయాన్ని అందుకుంది. 278 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియాకి అదిరిపోయే ఆరంభం దక్కింది. రచెల్ హేన్స్, ఆలీసా హేలీ కలిసి మొదటి వికెట్‌కి 121 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. 65 బంతుల్లో 9 ఫోర్లతో 72 పరుగులు చేసిన ఆలీసాని, స్నేహ్ రానా అవుట్ చేయగా 52 బంతుల్లో 5 ఫోర్లతో 43 పరుగులు చేసిన రచెల్, పూజా వస్త్రాకర్ బౌలింగ్‌లో అవుటైంది...

వరుస ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియాను మెగ్ లానింగ్, ఎలీసా పెర్రీ ఆదుకున్నారు. మెగ్ లానింగ్ 81 బంతుల్లో 10 ఫోర్లతో 73 పరుగులు, ఎలీసా పెర్సీ 48 బంతుల్లో ఓ ఫోర్‌తో 28 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కి అజేయ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు...

41 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం ఆటంకం కలిగించింది. విరామం తర్వాత ఆట మొదలైన వెంటనే 28 పరుగులు చేసిన ఎలీసా పెర్నీని అవుట్ చేసి, ఆసీస్‌కి షాక్ ఇచ్చింది పూజా వస్త్రాకర్. ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడం, ఆసీస్ బ్యాటర్లు రన్‌రేట్ పెరగకుండా పరుగులు చేయడంతో ఆఖరి ఓవర్‌ దాకా మ్యాచ్ సాగింది...

107 బంతుల్లో 13 ఫోర్లతో 97 పరుగులు చేసిన మెగ్ లానింగ్‌ను 49వ ఓవర్‌ నాలుగో బంతికి అవుట్ చేసింది మేఘనా సింగ్. ఆ తర్వాత రెండు బంతుల్లో పరుగులేమీ రాకపోవడంతో ఆఖరి ఓవర్‌లో 8 పరుగులు కావాల్సి వచ్చాయి. జులన్ గోస్వామి వేసిన ఆఖరి ఓవర్‌ మొదటి బంతికి ఫోర్ బాదిన బెత్ మూనీ, ఆ తర్వాతి బంతికి 2 పరుగులు తీసింది. విజయానికి 4 బంతుల్లో 2 పరుగులు కావాల్సిన దశలో ఫోర్ బాది మ్యాచ్‌ని ముగించింది.

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 277 పరుగుల స్కోరు చేయగలిగింది. వరల్డ్ కప్‌లో మరోసారి టీమిండియాకి శుభారంభం దక్కలేదు. 11 బంతుల్లో ఓ ఫోర్2తో 10 పరుగులు చేసిన స్మృతి మంధాన, డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లో మెగ్ లానింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యింది...

11 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది భారత జట్టు. వుమెన్స్ వరల్డ్‌కప్ 2022 టోర్నీలో తొలిసారి తుదిజట్టులో చోటు దక్కించుకున్న యంగ్ ఓపెనర్ షెఫాలీ వర్మ 16 బంతుల్లో ఓ ఫోర్, ఓ సిక్సర్2తో 12 పరుగులు చేసి డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరింది. దీంతో 28 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది టీమిండియా...


ఈ దశలో కెప్టెన్ మిథాలీ రాజ్, యస్తికా భాటియా కలిసి మూడో వికెట్‌కి 130 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి, భారత జట్టును ఆదుకున్నారు. వన్డే వరల్డ్ కప్‌ టోర్నీ చరిత్రలో భారత జట్టుకి మూడో వికెట్‌కి ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 83 బంతుల్లో 6 ఫోర్లతో 59 పరుగులు చేసిన యస్తికా భాటియా కూడా డార్సీ బ్రౌన్ బౌలింగ్‌లోనే భారీ షాట్‌కి ప్రయత్నించి అవుట్ అయ్యింది...

కెప్టెన్ మిథాలీ రాజ్ 96 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 68 పరుగులు చేసింది. మిథాలీ రాజ్‌‌కి వన్డే కెరీర్‌లో ఇది 63వ హాఫ్ సెంచరీ. మిథాలీ రాజ్ అవుటైన తర్వాత రిచా ఘోష్ 14 బంతుల్లో 8 పరుగులు, స్నేహ్ రాణా 5 బంతులాడి డకౌట్ కావడంతో వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది భారత జట్టు.

28 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 34 పరుగులు చేసి, హర్మన్‌ప్రీత్ కౌర్‌తో కలిసి ఏడో వికెట్‌కి 47 బంతుల్లో 64 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసిన పూజా వస్త్రాకర్, ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ అయ్యింది... 47 బంతుల్లో 6 ఫోర్లతో 57 పరుగులు చేసిన హర్మన్‌ప్రీత్ కౌర్ నాటౌట్‌గా నిలిచింది.