RCB vs CSK: చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం (చెపాక్)లో ఐపీఎల్ 2024 లో చెన్నై సూపర్ కింగ్స్-రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి మ్యాచ్ జరగ్గా, సీఎస్కే 6 వికెట్ల తేడాతో ఆర్సీబీని చిత్తుచేసింది. ముస్తాఫిజుర్ రెహ్మాన్ బెంగళూరు పతనాన్ని శాసించాడు.
CSK vs RCB: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్ 2024) 17 సీజన్ శుక్రవారం ఘనంగా ప్రారంభం అయింది. ప్రారంభ వేడుకల్లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్, ఏఆర్ రెహ్మాన్, సోనూ నిగమ్ సహా పలువురు బాలీవుడ్ తారలు అద్భుత ప్రదర్శనలతో అదరగొట్టారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే ఐపీఎల్ 2024లో తొలి మ్యాచ్ బెంగళూరు-చెన్నై జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో చెన్నై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. రుతురాజ్ గౌక్వాడ్ కెప్టెన్సీలో చెన్నై టీమ్ కు ఇది తొలి గెలుపు.
ఫాఫ్ డుప్లెసిస్.. దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ ధనాధన్ ఇన్నింగ్స్..
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ బ్యాటింగ్ కు దిగింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ, ఫాఫ్ డుప్లెసిస్ మంచి ఆరంభం అందించారు. డుప్లెసిస్ 38 పరుగుల తన ఇన్నింగ్స్ లో 8 బౌండరీలు బాదాడు. విరాట్ కోహ్లీ 21 పరుగులతో నిరాశపరిచాడు. జత్ పటిదార్, గ్లెన్ మ్యాక్స్ వెల్ డకౌట్ అయ్యారు. డుప్లెసిస్ ఔట్ అయిన తర్వాత అదే ఓవర్ లో రజత్ పటిదార్, తర్వాతి ఓవర్ లో గ్లెన్ మ్యాక్స్ వెల్ వికెట్లు పడ్డాయి. 77 పరుగుల వద్ద కోహ్లీ, వెంటనే కామెరాన్ గ్రీన్ ఔట్ అయ్యారు. అయితే, దినేష్ కార్తీక్, అనూజ్ రావత్ లు మంచి ఇన్నింగ్స్ ఆడటంతో బెంగళూరు టీమ్ 20 ఓవర్లలో 173 పరుగులు చేసింది. అనూజ్ రావత్ 48, దినేష్ కార్తీక్ 38 పరుగులు కొట్టారు.
ఆర్సీబీని దెబ్బకొట్టిన ముస్తాఫిజుర్ రెహ్మాన్..
ఆరంభంలో అదరగొట్టిన బెంగళూరు 200 పరుగులు చేస్తుందని భావించారు. కానీ ముస్తాఫిజుర్ రెహ్మాన్ మ్యాచ్ ఒకే ఓవర్ లో మలుపుతిప్పాడు. 5వ ఓవర్ లో రెండు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత మరో రెండు వికెట్లు తీసుకున్నాడు. మొత్తంగా 4 వికెట్లు.. కోహ్లీ, డుప్లెసిస్, పటిదార్, కామెరూన్ గ్రీన్ లను ఔట్ చేసి ఆర్సీబీని దెబ్బకొట్టాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.
సమిష్టిగా రాణించిన చెన్నై బ్యాటర్లు..
174 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 18.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (15 పరుగులు), రచిన్ రవీంద్ర (37 పరుగులు) చెన్నైకి మంచి శుభారంభం అందించారు. రహానే 27 పరుగులు, డారిల్ మిచెల్ 22 పరుగులు చేశారు. రవీంద్ర జడేజా (25 పరుగులు నాటౌట్), శివం దూబే (34 పరుగులు నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి చెన్నైకి విజయాన్ని అందించారు. 6 వికెట్ల తేడాతో బెంగళూరుపై చెన్నై విజయం సాధించింది. బెంగళూరు బౌలర్లలో కామెరాన్ గ్రీన్ 2 వికెట్లు, యశ్ దయాల్, కరణ్ శర్మలు చెరో వికెట్ తీశారు.
RCB vs CSK: టీ20 క్రికెట్ లో విరాట్ కోహ్లీ తొలి భారతీయుడిగా మరో ఘనత..
