ఐపీఎల్‌ అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ప్రతి సీజన్‌లో ప్లే ఆఫ్స్‌కు/ సెమీఫైనల్స్‌కు చేరుకున్న ఏకైక జట్టు సిఎస్‌కే. ఈ సీజన్‌ టైటిల్‌ సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ టైటిల్‌ ఫేవరెట్‌. అందుకు తగ్గట్టుగానే సూపర్‌ కింగ్స్‌ ప్రణాళికలు ఉన్నాయి. ఆగస్టు 20న చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో సూపర్‌ కింగ్స్‌ బృందం దుబాయికి చేరుకోనుంది. 

అందుకోసం ఆగస్టు 19న ఆటగాళ్లందరూ చెన్నైకి చేరుకుంటారని తొలుత భావించారు. కానీ దుబాయికి బయల్దేరడానికి ముందు చెపాక్‌లో ఐదు రోజుల ప్రాక్టీస్‌ సెషన్‌కు సూపర్‌ కింగ్స్‌ ప్రణాళిక రచించింది. లాక్‌డౌన్‌ విరామం అనంతరం సూపర్‌ కింగ్స్‌ ఆటగాళ్లు ఇక్కడే మ్యాచ్‌ ప్రాక్టీస్‌ మొదలు పెడతారని ప్రాంఛైజీ వర్గాలు చెబుతున్నాయి. 

అందుకోసం చెపాక్‌ స్టేడియంలో నెట్‌ ప్రాక్టీస్‌కు ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. చెపాక్‌లో ప్రాక్టీస్‌కు స్థానిక యంత్రాంగం నుంచి అనుమతులు సైతం తమిళనాడు క్రికెట్‌ సంఘం (టిఎన్‌సీఏ) పొందినట్టు సమాచారం. 

దుబాయిలో ఐసీసీ నెట్‌ సదుపాయం వినియోగించుకునేందుకు సూపర్‌ కింగ్స్‌ సిద్ధమవుతోంది. అందుకే, ఐసీసీ అకాడమీకి సమీపంలోని ప్రముఖ హౌటల్‌లో రెండు ఫ్లోర్లు పూర్తిగా బుక్‌ చేసినట్టు సమాచారం. 

ముంబయి ఇండియన్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లు అబుదాబిలో బస చేయనున్నాయి. బయో సెక్యూర్‌ బబుల్‌లో జరిగే ఐపీఎల్‌లో కుటుంబ సభ్యులకు అనుమతిపై ప్రాంఛైజీల నిర్ణయాన్ని వదిలేసిన సంగతి తెలిసిందే. 

సూపర్‌ కింగ్స్‌ శిబిరంలో క్రికెటర్ల కుటుంబ సభ్యులు ఎక్కువగా కనిపిస్తారు. కానీ కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా కుటుంబ సభ్యులను యుఏఈకి తీసుకెళ్లకూడదనే నిర్ణయాన్ని అందరూ తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆగస్టు 20న సూపర్‌ కింగ్స్‌ క్రికెటర్లు, సహాయక సిబ్బంది, అధికారులు మాత్రమే దుబాయి విమానం ఎక్కనున్నారు.