Asianet News TeluguAsianet News Telugu

ఏంటిది...జడేజా వస్తున్నాడు..: ధోని ఫ్యాన్స్ ను ఆటపట్టించిన చెన్నై ఆల్ రౌండర్

ఐపిఎల్ 2024 లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్ కతా నైటర్స్ మధ్య మరో అద్భుత మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో అద్భుత ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన జడేజా ధోని ఫ్యాన్స్ ను సరదాగా ఆటపట్టించాడు. 

CSK Player Ravindra Jadeja teased MS Dhoni Fans in Chepauk  AKP
Author
First Published Apr 9, 2024, 8:40 AM IST

చెన్నై : టీమిండియా ఆటగాడు రవీంద్ర జడేజా ఆటలో చాలా సీరియస్ గా వుంటాడు... అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ తోనే కాదు కళ్లుచెదిరే పీల్డింగ్ తో ప్రత్యర్థి జట్టును బెంబేలెత్తించగల అద్భుత ఆల్ రౌండర్. అయితే మైదానంలో ఎంత సీరియస్ గా వుంటాడో బయట అంత సరదాగా వుంటాడు జడ్డూ. ఈ విషయాన్ని అతడి సహచర ఆటగాళ్లు పలు సందర్భాల్లో తెలియజేసారు. తాజాగా దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఫ్యాన్స్ ని ఆటపట్టించాడు జడేజా. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 లో భాగంగా నిన్న(సోమవారం) రాత్రి చెన్నై సూపర్ కింగ్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్ చేసిన కోల్ కతా కేవలం 137 పరుగులకే పరిమితం అయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని చెన్నై టీం ఆడుతూ పాడుతూ చేధించింది. అయితే చెన్నై విజయానికి కేవలం 3 పరుగులు దూరంలో వున్నపుడు విధ్వంసకర బ్యాటర్ శివమ్ ధూబే ఔటయ్యాడు. ఇలా దూబే పెవిలియన్ బాటపట్టడం చెన్నై ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచింది... ఎందుకంటే మహేంద్ర సింగ్ క్రీజులోకి వస్తాడు కాబట్టి. దూబే ఔట్ తర్వాత చెపాక్ స్టేడియం మొత్తం ధోని నామస్మరణతో మారుమోగింది. ఈ సమయంలోనే జడేజా చెన్నై ఫ్యాన్స్ ఆటపట్టించాడు. 

ధోని వస్తాడని ఎదురుచూస్తుండగా ఒక్కసారిగా జడేజా బ్యాట్ పట్టుకుని మైదానంవైపు అడుగులేసాడు. దీంతో ఫ్యాన్స్ అవాక్కయిపోయారు. ఏంటి ధోని బ్యాటింగ్ కు రావడంలేదా? జడేజా వస్తున్నాడేంటి? అనుకున్నారు. కానీ తానే బ్యాటింగ్ చేయడానికి వెళుతున్నట్లు బిల్డప్ ఇచ్చి ఒక్కసారిగా వెనక్కితిరిగాడు జడేజా. ఇలా ఫ్యాన్స్ ను టీజ్ చేస్తూ చెపాక్ లో సరదా వాతావరణాన్ని క్రియేట్ చేసాడు జడ్డూ. 

 

జడేజా వెనక్కి వెళ్లిపోగా మహేంద్ర సింగ్ ధోని మైదానంలో అడుగుపెట్టాడు. దీంతో చెపాక్ స్టేడియం ఫ్యాన్స్ కేరింతలతో మారుమోగింది. ధోని విన్నింగ్ షాట్ ఆడకున్నా బ్యాట్ పట్టుకుని క్రీజులోకి రావడమే ఫ్యాన్స్ ను ఖుషీ చేసింది. ధోని మైదానంలో వున్నంతసేపు చెపాక్ దద్దరిల్లింది.   కెప్టెన్, మాజీ కెప్టెన్ కలిసి మ్యాచ్ ను ముగించారు... ధోని విన్నింగ్ షాట్ కొడతాడనుకుంటే రుతురాజ్ గైక్వాడ్ ఆ పని కానిచ్చేసాడు.   
 
మ్యాచ్ విన్నర్ గా జడేజా :

స్ట్రాంగ్ బ్యాటింగ్ లైనప్ కలిగిన కోల్ కతా నైట్ రైడర్స్ ను గింగిరాల తిరిగే బంతులేస్తూ బెంబేలెతత్తించాడు జడేజా. ఒకే ఓవర్లో రెండు వికెట్లు... మొత్తంగా మూడు వికెట్లు తీసి కోల్ కతా నడ్డివిరిచాడు. విధ్వంసకర బ్యాటర్లు సునీల్ నరైన్, రఘువంశి, వెంకటేష్ అయ్యర్ లను జడేజా పెవిలియన్ కు పంపించాడు.  అలాగే ఫిలిప్ సాల్ట్, శ్రేయాస్ అయ్యర్, మిచెల్ స్టార్క్ లను కళ్ళుచెదిరే క్యాచ్ లు పట్టి ఔట్ చేసాడు. ఇలా కోల్ కతాపై చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించిన జడేజా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.  

 
 

Follow Us:
Download App:
  • android
  • ios