South Africa T20 League: భారత్ లో విజయవంతమై ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తరహాలోనే  దక్షిణాఫ్రికాలో కూడా వచ్చే ఏడాది ఓ టీ20 లీగ్ రాబోతున్నది. 

నానాటికీ నష్టాల్లో కూరుకుపోతున్న క్రికెట్ దక్షిణాఫ్రికా (సీఎస్ఏ) భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అడుగుజాడల్లో నడిచి లాభాల బాట పట్టేందుకు ప్రయత్నిస్తున్నది. భారత క్రికెట్ కు బంగారు బాతులా దొరికిన ఐపీఎల్ మాదిరిగానే తమ దేశంలో కూడా ఓ హై ఓల్టేజ్ క్రికెట్ లీగ్ ను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. గతంలో ఐపీఎల్ లో పనిచేసిన పలువురు సభ్యుల సహకారంతో వచ్చే ఏడాది తొలి అంకంలో ఈ లీగ్ ను నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నది. అయితే దక్షిణాఫ్రికాలో కూడా ఐపీఎల్ ఫ్రాంచైజీలే పెట్టుబడులు పెట్టబోతున్నాయి.

ఐపీఎల్ లో విజయవంతమైన ఫ్రాంచైజీలుగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ లతో పాటు ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్తాన్ రాయల్స్, కోల్కతా నైట్ రైడర్స్ కూడా సౌతాఫ్రికా టీ20 క్రికెట్ లీగ్ లో జట్లను కొనుగోలు చేయనున్నాయని సమాచారం. 

ఐపీఎల్ విజయవంతం కావడంలో వెనకుండి నడిపించడంలో కీలక పాత్ర పోషించిన మాజీ ఎగ్జిక్యూటివ్ సుందర్ రామన్ తో పాటు మరికొందరు కీలక వ్యక్తులు కలిసి ఈ లీగ్ కోసం రాత్రీ పగలు పనిచేస్తున్నారంట. ఐపీఎల్ మాదిరిగానే సౌతాఫ్రికా టీ20 లీగ్ ను విజయవంతం చేసేందుకు అనువైన అవకాశాలు, ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

గతంలో దక్షిణాఫ్రికా.. గ్లోబల్ టీ20 లీగ్, మజన్సి సూపర్ లీగ్ పేరిట రెండు లీగ్ లను ఏర్పాటు చేసింది. కానీ అవి అంతగా విజయవంతం కాలేదు. దక్షిణాఫ్రికా మీడియా సంస్థల నివేదికల ప్రకారం.. ఈ రెండు లీగ్ ల ద్వారా సీఎస్ఏకు ఏకంగా సుమారు 20 మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. కానీ ఈసారి మాత్రం గురి తప్పకూడదని.. ఈ లీగ్ తో దక్షిణాఫ్రికా క్రికెట్ చరిత్ర మొత్తం మారిపోవాలని సుందర్ రామన్, ఇతర ఐపీఎల్ ఎక్స్పర్ట్స్ తో చెప్పినట్టు తెలుస్తున్నది.

Scroll to load tweet…

ఈ నేపథ్యంలోనే సుందర్ రామన్ అండ్ కో.. ఐపీఎల్ లో తమకున్న పరిచయాలతో దక్షిణాఫ్రికా టీ20 లీగ్ లో కూడా జట్లు కొనుగోలు చేసే విధంగా ఇక్కడి ఫ్రాంచైజీలను ఒప్పించాయట. అందుకు పై ఫ్రాంచైజీలు కూడా ఒప్పుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా 6 జట్లతో నిర్వహించనున్న ఈ లీగ్ లో జట్లను సొంతం చేసుకోవడం లేదా వాటిలో పెట్టుబడులు పెట్టనున్న ఫ్రాంచైజీలలో ముంబై, ఢిల్లీ, చెన్నై, రాజస్తాన్, కోల్కతా ల పేర్లు వినబడుతున్నాయి.

ఇక ఫారెన్ లీగ్ లలో పెట్టుబడులు పెట్టడం ఐపీఎల్ ఫ్రాంచైజీలకు ఇదే తొలిసారి కాదు. ఇప్పటికే ముంబై, ఢిల్లీలకు ఎమిరేట్స్ టీ20 లీగ్ లో టీమ్ లను కొనుగోలు చేశాయి. రాజస్తాన్ రాయల్స్ కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) లో పెట్టుబడులు పెట్టింది. పంజాబ్ సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ కు సీపీఎల్ లో ఓ జట్టు ఉంది. అయితే చెన్నై మాత్రం ఫారెన్ లీగ్ లలో పెట్టుబడులు పెట్టడం ఇదే తొలిసారి. మరి ఐపీఎల్ ఫ్రాంచైజీలు అడుగుపెడుతున్న ఈ లీగ్.. దక్షిణాఫ్రికా క్రికెట్ కు లాభిస్తుందా లేదా..? అనేది వేచి చూడాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరి లో ఈ లీగ్ ను ప్రారంభించేందుకు దక్షిణాఫ్రికా సన్నాహకాలు చేస్తున్నది.