మహేంద్ర సింగ్ ధోని... ఐపిఎల్ ప్రారంభమైనప్పటి నుండి చెన్నై సూపర్ కింగ్స్ జట్టును విజయవంతంగా ముందుకు నడిపిస్తున్నాడు. కెప్టెన్ గానే కాకుండా మిడిలార్డర్ లో కీలక బ్యాట్ మెన్ గా, అద్భుతమైన వికెట్ కీపర్ గా ధోని ఆ జట్టుకు వెన్నెముఖలా మారాడు. ఒక వేళ అతడు జట్టుకు దూరమైతే పరిస్థితి ఎలా వుంటుందో ఇటీవల హైదరాబాద్ లో సన్ రైజర్స్ జట్టుతో జరిగిన మ్యాచ్ ద్వారా తెలిసింది. కేవలం ఈ ఒక్క మ్యాచ్ కు అతడు ఆడకపోవడం వల్ల చైన్నైఘోరంగా ఓడిపోయింది. ఆ తర్వాత అతడు జట్టులోకి రాగానే చెన్నై మళ్లీ విజయాల బాట పట్టింది.  

ఇదే విషయంపై తాజాగా  చెన్నై కోచ్ మైక్ హస్సీ స్పందించాడు. ధోనికి విశ్రాంతినిస్తే అది చెన్నై జట్టుపై తీవ్ర ప్రభావం చూపుతోందని హస్సీ తెలిపాడు. అందువల్లే 
అప్పుడప్పుడు అతడు వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్నా విశ్రాంతి ఇవ్వడానికి జంకుతున్నామని అన్నాడు. ధోని కూడా జట్టు ప్రయోజనాలను దృష్టిలో వుంచుకుని విశ్రాంతి తీసుకోడానికి ఇష్టపడటం లేదని హస్సీ పేర్కొన్నాడు. 

ధోని ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ తో వున్నాడని...వెన్ను నొప్పి తీవ్రత కూడా తగ్గిందన్నాడు. ఈ సీజన్లో అతడు అటు బ్యాటింగ్, ఇటు కీపింగ్ తో పాటు కెప్టెన్ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నాడని కొనియాడాడు. ఇప్పటివరకు సీఎస్కే గెలిచిన  అన్ని మ్యాచుల్లోనూ అతడు ప్రముఖ పాత్రమ పోషించాడని అన్నాడు. ఇలాంటి సమయంలో మళ్లీ జట్టుపై ప్రభావం పడకూడదనే ఇప్పటికే  ప్లేఆఫ్ బెర్తును ఖాయం చేసుకున్నా ధోనికి విశ్రాంతినివ్వడం లేదని హస్సీ వెల్లడించాడు.