సీఎస్‌కే కొత్త జెర్సీపై చెన్నైలో అల్కహాల్ తయారుచేసే కంపెనీకి చెందిన ఎస్‌ఎన్‌జే 10000 లోగో...అల్కహాల్ కంపెనీకి చెందిన లోగో తొలగించాలంటూ మొయిన్ ఆలీ కోరినట్టు వార్తలు... వాటిని ఉట్టి పుకార్లేనని కొట్టేసిన సీఎస్‌కే సీఈవో...
ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ మొయిన్ ఆలీని చెన్నై సూపర్ కింగ్స్, రూ. 7 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆవిష్కరించిన సీఎస్‌కే జెర్సీని ధరించేందుకు మొయిన్ ఆలీ నిరాకరించాడని, దానిపై ఉన్న ఓ అల్కహాల్ బ్రాండ్ లోగోని తొలగించాలని విన్నవించాడని... దానికి సీఎస్‌కే అంగీకరించిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
అయితే ఈ వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని స్పష్టం చేశాడు సీఎస్‌కే సీఈఓ కాశీ విశ్వనాథ్... సీఎస్‌కే జెర్సీపై ఎస్‌ఎన్‌జే 10000 లోగో, చెన్నైలో అల్కహాల్ తయారుచేసే కంపెనీకి చెందినది. ముస్లిం మతాచారాల ప్రకారం మద్యాన్ని స్వీకరించడం కానీ, మద్యాన్ని స్వీకరించేలా ప్రోత్సాహించే లోగోలను ప్రచారం చేయడం కానీ చేయకూడదు.
అందుకే మొయిన్ ఆలీ ఈ లోగోని తొలగించాలని చెన్నై సూపర్ కింగ్స్‌ను కోరినట్టు, దానికి వాళ్లు అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. ‘ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. అతను మమ్మల్ని ఏమీ కోరలేదు.. మేమూ ఏమీ మార్చలేదు’ అంటూ స్పష్టత ఇచ్చాడు కాశీ విశ్వనాథ్.
ఇప్పటిదాకా 19 ఐపీఎల్ మ్యాచులు ఆడిన మొయిన్ ఆలీ, 309 పరుగులు చేసి 10 వికెట్లు పడగొట్టాడు. హర్భజన్ సింగ్, పియూష్ చావ్లా లేకపోవడంతో మొయిన్ ఆలీ నుంచి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఆశిస్తోంది సీఎస్‌కే...
