స్పోర్ట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020 ద్వారా మరో యువ క్రికెటర్ వెలుగులోకి వచ్చారు. గురువారం చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ 72 పరుగులు బాది తానేంటో నిరూపించుకున్నాడు. అయితే అతడిలో దాగున్న అత్యుత్తమ బ్యాట్స్ మెన్ ని గుర్తించడంలో తాము ఆలస్యం చేశామని... అందుకు కరోనానే కారణమని సీఎస్కే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని వెల్లడించారు. 

కెకెఆర్ పై విజయం తర్వాత మాట్లాడిన ధోని రుతురాజ్ పై ప్రశంసలు కురిపించాడు. ఈ సీజన్ లో రుతురాజ్ కు మొదట అవకాశాన్నిచ్చినా సద్వినియోగం చేసుకోలేక డకౌట్ అయ్యాడని అయినప్పటికి మరోసారి అతడికి అవకాశం ఇచ్చామన్నాడు. తమ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అద్భుత ప్రదర్శనతో  జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడని కెప్టెన్ కూల్ కొనియాడాడు. 

రుతురాజ్ యూఏఈకి వచ్చిన తర్వాత కరోనా బారిన పడటంతో అతడు క్వారంటైన్ లో వుండాల్సి వచ్చింది. దీంతో అతడి బ్యాటింగ్ గురించి పూర్తిగా తెలియక సామర్థ్యాన్ని అంచనా వేయలేకపోయాం. ఇది తమకు నష్టం కలిగించిందన్నారు. ఒత్తిడికి గురవకుండా అతడు బ్యాటింగ్ చేసిన తీరు బావుందని...ఈ ప్రదర్శన పట్ల అతడు సంతోషంగా వుండివుంటాడని ధోని అన్నారు. 

చెన్నై వర్సెస్ కోల్‌కత: అద్భుత విజయం సాధించిన ధోని సేన, కేకేఆర్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టం

173 పరుగుల భారీ టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన చెన్నై సూపర్ కింగ్స్‌కి ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. మొదటి వికెట్‌కి 50 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 14 పరుగులు చేసిన షేన్ వాట్సన్ అవుట్ అయ్యాడు. అంబటి రాయుడు 20 బంతుల్లో 38 పరుగులు చేసి అవుట్ కాగా... ఎమ్మెస్ ధోనీ 1 పరుగుకే మరోసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 

53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 72 పరుగులు చేసిన రుతురాజ్ గైక్వాడ్... వరుసగా సీజన్‌లో రెండో హాఫ్ సెంచరీ నమోదుచేశాడు. శామ్ కర్రాన్ 13, రవీంద్ర జడేజా 11 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 31 పరుగులు చేశాడు. 

ఆధిక్యం చేతులు మారుతూ సాగిన ఈ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆఖరి బంతికి విజయం అందుకుంది. 2 బంతుల్లో 7 పరుగులు కావాల్సినదశలో ఆఖరి రెండు బంతుల్లో 2 సిక్సర్లు బాది విజయాన్ని అందించాడు రవీంద్ర జడేజా. ప్లేఆఫ్ రేసు నుంచి దూరమైన తర్వాత వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్.