అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే మొదటిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్లో ప్లేఆఫ్ కు చేరుకోలేకపోయింది. వరుస పరాజయాలతో ప్లేఆఫ్ కు చేరే అవకాశాన్ని చెన్నై జట్టు కోల్పోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని విమర్శలపాలవుతున్నారు. ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించినట్లే ఐపిఎల్ నుండి కూడా తప్పుకోవాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు  కొందరు. ఈ క్రమంలోనే ధోనికి ఇదే చివరి ఐపిఎల్ అంటూ ప్రచారం కూడా మొదలయ్యింది. 

ఇలా తన ఐపిఎల్ కెరీర్ పై సాగుతున్న ప్రచారంపై తాజాగా ధోనినే క్లారిటీ ఇచ్చాడు. ఈ సీజన్లో చివరి మ్యాచ్ ఆదివారం కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తో ఆడింది చెన్నై సూపర్ కింగ్స్. ఈ క్రమంలోనే పసుపు రంగు జెర్సీలో ఆడటం ఇదే చివరిసారా అంటూ వ్యాఖ్యత అడిగిన ప్రశ్నకు ''ఖచ్చితంగా కాదు'' అంటూ ధోని ఒక్కమాటలో సమాధానమిచ్చాడు. ఇలా ఐపిఎల్ నుండి కూడా తప్పుకోనున్నాడంటూ సాగుతున్న ప్రచారానికి ఒక్కమాటతో తెరదించారు ధోని. 

read more  నేను కూడా ‘మిస్టర్ కూల్’ మహేంద్ర సింగ్ ధోనీ వీరాభిమానినే... ఎందుకంటే...

''ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రయాణం కఠినంగా సాగింది. ప్రారంభ మ్యాచ్ నుండి చాలా తప్పులు చేశాం కాబట్టే ప్లేఆఫ్ కు చేరలేకపోయాం. వచ్చే సీజన్ కు కొత్త ప్రణాళికలు, సరికొత్త ఆటగాళ్లతో మీ ముందుకోస్తాం'' అన్నారు ధోని. 

''ఐపిఎల్ ప్రారంభంలో పదేళ్ల ప్రణాళికతో జట్టును సిద్దం చేశాం. ఆ గడువు ముగిసింది కాబట్టి మరో పదేళ్ల నూతన ప్రణాళికతో జట్టును సిద్దం చేయాల్సిన సమయమిది. కాబట్టి వచ్చే తరాలకు బాధ్యతలను అప్పగించాల్సి వుంటుంది'' అని ధోని పేర్కొన్నారు.