క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ సీజన్-12 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ధోని వ్యూహాల ధాటికి బెంగళూరు చతికిలపడింది.

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ధోనీ స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై పెద్దగా అంచనాల్లేని వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌కి రెండో ఓవర్‌లోనే బౌలింగ్ ఇచ్చాడు. కెప్టెన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయని భజ్జీ ఆర్‌సీబీ టాప్ ఆర్డర్ వెన్ను విరిచాడు.

హర్భజన్ ధాటికి ఎనిమిది ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు కేవలం 39 పరుగులు చేసిన నాలుగు వికెట్లు కోల్పోయింది. అగ్రశ్రేణి ఆటగాళ్లయిన విరాట్ కోహ్లీ, మొయన్ అలీ, డివిలియర్స్ తక్కువ పరుగులకే వెనుదిరిగారు.

టాప్ ఆర్డర్ విఫలమవ్వడంతో మిగిలిన ఆటగాళ్లు కూడా ఫెయిల్ అయ్యారు. హర్భజన్‌కు తోడుగా ఇమ్రాన్ తాహిర్ రెచ్చిపోవడంతో రాయల్ ఛాలెంజర్స్ 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది.

బెంగళూరు జట్టులో పార్థివ్ పటేల్ ఒక్కడే టాప్ స్కోరర్. అయితే స్వల్ప లక్ష్యాన్ని చేధించేందుకు చెన్నై అపసోపాలు పడింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో లక్ష్యాన్ని ఛేదించేందుకు చెన్నై 17.4 ఓవర్లు తీసుకుంది.