ఇండియన్ ప్రీమియర్ లీగ్  2019 ముగిసి రెండు రోజులవుతున్నా క్రికెట్ ప్రియులింకా అదే లోకంలో వున్నారు. లీగ్ జరుగుతున్నంత కాలం తమ అభిమాన జట్లకు  సంబంధించిన మ్యాచులు, ఆటగాళ్ల ఆటతీరు గురించి చర్చించుకున్న వారు ఫైనల్ తర్వాత ఒకే విషయం గురించి  మాట్లాడుకుంటున్నారు. సహజంగానే వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తుతూ సింగిల్స్, డబుల్స్ రాబట్టడంలో దిట్ట అయిన ధోని రనౌటవడం అందరిలోనూ అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా చెన్నై అభిమానులయితే  అంపైర్ల తీరుపై సోషల్ మీడియా ద్వారా ఏకిపారేస్తున్నారు. 

అయితే అభిమానుల  అనుమానాలకు బలాన్ని చేకురుస్తూ తాజాగా చెన్నై బౌలర్ హర్భజన్ సింగ్ ఈ రనౌట్ పై ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ముంబైతో  తాము తలపడ్డ ఐపిఎల్ ఫైనల్లో లెక్కకు మించిన తప్పులు జరిగాయని  హర్భజన్ ఆరోపించాడు. ముఖ్యంగా మ్యాచ్ రసవత్తరంగా సాగుతున్న సమయంలో  మహేంద్ర సింగ్ రనౌట్ తమ విజయావకాశాలను దెబ్బతీసిందని అన్నారు. ధోని రనౌట్ పై స్పష్టత లేనపుడు బెన్‌ఫిట్ ఆఫ్ డౌట్ కింద అంపైర్లు నాటౌట్ గా ప్రకటించాల్సింది. కానీ వారు అనూహ్యంగా ఔటయినట్లు డిసిషన్ ఇవ్వడంతో చెన్నైకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలిందన్నాడు. 

ఇలా అంపైర్ల ఏకపక్ష నిర్ణయంతో తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందన్నాడు. కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో ఇలాంటి తప్పుడు నిర్ణయాలకు తాము బలయ్యామని... లేదంటే ఈ ఐపిఎల్ సీజన్ 12 ట్రోఫీ తమదేనని హర్భజన్ పేర్కొన్నాడు.