అభిమానులకు సమ్మర్ లో అసలు సిసలైన క్రికెట్ మజాను అందించే ఐపిఎల్ ఆరంభమైంది. శనివారం గతేడాది చాంఫియన్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్  చాలెంజర్ జట్టుతో తలపడింది. ఈ మ్యాచ్ ద్వారా  చెన్నై జట్టు తాము నిజంగానే చాంఫియన్లమని మరోసారి నిరూపించుకుంది. హేమాహేమీ బ్యాట్ మెన్స్ ని కలిగి వున్న బెంగళూరు జట్టును చెన్నై బౌలర్లు ముప్పు తిప్పలు పెట్టి కేవలం 70 పరుగులకే ఆలౌట్ చేశారు.ఇలా రెచ్చిపోయిన ఆ జట్టు బౌలర్ హర్భజన్ సింగ్ పలు ఐపిఎల్ రికార్డులను బద్దలుగొట్టాడు. 

ఆర్సీబి మొదట బ్యాటింగ్ కు దిగగా చెన్నై కెప్టెన్ ధోని ప్రయోగాలతోనే మ్యాచ్ ను ప్రారంభించారు. భజ్జీపై నమ్మకంతో  ధోని ఆరంభ ఓవర్లలోని అతడి చేతికి బంతిని అందించాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఐపిఎల్ సీజన్ లో మొదటి వికెట్ ను హర్భజన్ పడగొట్టాడు. అధి ఏ అల్లాటప్పా ఆటగాడిదో కాదు, ఆర్సిబి కెప్టెన్ విరాట్ కోహ్లీది. కేవలం 6 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీని...ఆ తర్వాత  మొయిన్ అలీ(9), డివిలియర్స్(9) వంటి స్టార్ బ్యాట్ మెన్స్ ని హర్భజన్ వెంటవెంటనే పెవిలియన్ కు పంపించాడు. 

ఇలా ఆర్సిబి పై మూడు వికెట్లు పడగొట్టిన భజ్జీ ఖాతాలో ఓ అరుదైన రికార్డు చేరింది. బెంగళూరు జట్టుపై అత్యధిక వికెట్లు పడగొట్టిన రికార్డు ఇప్పటివరకు అశిశ్ నెహ్రా(23 వికెట్లు) పేరిట వుండగా దాన్ని హర్భజన్ సమం చేశాడు. అతడితో సమానంగా  హర్భజన్ కూడా 23 వికెట్లు పడగొట్టాడు. 

అలాగే కాట్ ఆండ్ బౌల్డ్ వికెట్లు తీయడంలోనూ భజ్జీ మరో రికార్డు నెలకొల్పాడు. మొయిన్ అలీని ఓ అద్భుతమైన బంతికి బోల్తా కొట్టించిన భజ్జీ గాల్లోకి లేచిన బంతిని తానే ఒడిసి పట్టుకున్నాడు. ఇలా మరో కాట్ ఆండ్ బౌల్డ్ వికెట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇలా బ్రావో పేరిట వున్న అత్యధిక కాట్ ఆండ్ బౌల్డ్(10 వికెట్లు) రికార్డును భజ్జీ అధిగమించాడు.  

మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు చెన్నై బౌలర్ల విజృంభణతో కేవలం 17.1 ఓవర్లలో 70 పరుగులకే ఆలౌటయ్యింది. స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన చెన్నై కేవలం 17.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.