లాక్‌డౌన్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్రీడలు వాయిదా పడ్డాయి. దీనికి క్రికెట్ కూడా మినహాయింపు కాదు. అన్ని దేశాల్లో లాక్‌డౌన్ అమల్లో ఉండటం, భౌతిక దూరం వంటి ఆంక్షల కారణంగా క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించడం సాధ్యం కాలేదు. కోట్లాది మంది ఎదురుచూసిన ఐపీఎల్ సైతం కరోనాతో వాయిదా పడింది.

దీంతో క్రికెట్ అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడు నిర్వహిస్తామనే దానిపై బీసీసీఐ క్లారిటీ ఇచ్చింది. రుతుపవనాల అనంతరం దేశంలో మ్యాచ్‌లు మొదలయ్యే అవకాశం ఉందని బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ ఆశాభావం వ్యక్తం చేశారు.

Also Read:ఐపీఎల్ మేం నిర్వహిస్తామంటూ బీసీసీఐకి యూఏఈ ఆఫర్

అంతేకాకుండా ఐపీఎల్‌ను కూడా నిర్వహిస్తామని ఆయన చెప్పారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహించే పరిస్ధితులు మెరుగుపడతాయని రాహుల్ వెల్లడించారు.

అయితే ఆటగాళ్ల భద్రతకే అత్యంత ప్రాధాన్యమనే విషయాన్ని ఆయన మరోసారి స్పష్టం చేశారు. మ్యాచ్‌ల నిర్వహణకు సంబంధించి భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు నడుచుకుంటామని, కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తామని రాహుల్ పేర్కొన్నారు.

Also Read:ఐపీఎల్ కి లైన్ క్లియర్: బీసీసీఐ దెబ్బకు ప్రపంచ కప్ కూడా వెనక్కి!

మరోవైపు అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం ఉన్న నేపథ్యంలో కేవలం భారతీయ ఆటగాళ్లతోనే ఐపీఎల్‌ను నిర్వహిస్తారా అనే ప్రశ్నకు సమాధానంగా... వివిధ దేశాల ఆటగాళ్ల అత్యుత్తమ ప్రదర్శనే ఐపీఎల్ ప్రత్యేకతన్నారు. దీనిని నిలబెట్టుకునేందుకు తమలో ప్రతి ఒక్కరూ ప్రయత్నిస్తారని రాహుల్ స్పష్టం చేశారు.

ఇక దేశీయ క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణ గురించి మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ చూడని ఇలాంటి సంక్షోభం నేపథ్యంలో తమకు ఏది ఉత్తమమైనది అనే విషయాన్ని వ్యక్తుల నిర్ణయానికే వదిలి వేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే దేశీయ మ్యాచ్‌లను ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నామని రాహుల్ చెప్పారు.