ఐపీఎల్ కి లైన్ క్లియర్: బీసీసీఐ దెబ్బకు ప్రపంచ కప్ కూడా వెనక్కి!
కరోనా మహమ్మారి దెబ్బకు సందిగ్ధతలో పడి నిరవధికంగా వాయిదాపడ్డ ఐపీఎల్ ని నిర్వహించేందుకు బీసీసీఐ మాస్టర్ ప్లాన్ వేసింది. ఈ ప్లాన్ దెబ్బకు అన్ని క్రికెట్ బోర్డులు కూడా, ప్రపంచ కప్ కన్నా ఐపీఎల్ ఏ ముద్దు అనే స్థితికి చేరుకున్నాయి.
కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవానికి ప్రపంచం అతలాకుతలం అవుతుంది. క్రీడారంగమైతే ప్రపంచ యుద్ధాల సమయంలో ఏ సందిగ్ధతనయితే ఎదుర్కుందో.... అలాంటి సందిగ్ధతనే ఇప్పుడు ఎదుర్కొంటోంది.
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు క్రికెట్ బోర్డులు అస్థిత్వ పోరాటం చేస్తున్నాయి!. ఓ రెండు నెలల ఆట నిలిచిపోవటంతోనే ఇంత పెద్ద మాట ప్రయోగం అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ కరోనా ప్రళయానికి ముందు నుంచే ఆర్థిక నష్టాలు చవిచూసిన కొన్ని బోర్డులు.. ఇప్పుడు ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించటంతో అస్థిత్వ పోరాటమే చేయాల్సి వస్తుంది.
ఇటీవల ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ టెలి కాన్ఫరెన్స్‌లో సమావేశమైంది. ప్రస్తుత ఆపత్కాలంలో ఆర్థిక విపత్తు నుంచి బయటపడేందుకు అక్టోబర్‌లో ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ నిర్వహణ ఎంతో అవసరమనే అభిప్రాయం వెలిబుచ్చారు. టీ20 వరల్డ్‌కప్ నిర్వహణతో బిగ్-3 దేశాలు (భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా) మినహా ఇతర దేశాల బోర్డులకు రూ. 50-60 కోట్లు ఐసీసీ వాటాగా లభిస్తాయి.
ఆర్థికంగా కృంగిపోయి ఉన్న బోర్డులకు డబ్బులకన్నా ఈ సమయంలో కావాల్సిందేముంటుంది చెప్పండి? అయితే ఈ బోర్డులకు ఇక్కడ ఆదాయంగా లభించే 50 60 కోట్లకన్నా ఎన్నో రేట్ల ఎక్కువ డబ్బులు తక్కువ సమయంలో లభించే ఇంకో ఆప్షన్ కూడా ఉంది. అదే భారత్ తో సిరీస్. ప్రపంచ కప్ కన్నా తక్కువ వ్యవధి, భారీ లాభాలు. ఎవరు కాదంటారు చెప్పండి? దీన్నే ఇప్పుడు బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణ కోసం వాడనుంది.
టీమ్ ఇండియాతో స్వదేశంలో ఓ సిరీస్ ఆడితే.. అంతకుమించి ఎన్నో రెట్ల ఆదాయం, ఇతర ప్రయోజనాలు చేకూరుతాయి. దీంతో కరోనా కష్టకాలం ముగిసిన వెంటనే భారత్‌తో స్వదేశీ సిరీస్ నిర్వహణకు అన్ని దేశాలు ఉబలాడపడుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు బీసీసీఐ సాయాన్ని ఆర్థిస్తున్నాయి. ఇదే అదననుగా ఐపీఎల్‌కు ప్రత్యేక షెడ్యూల్ విండోకు అన్ని దేశాలు అంగీకరించాలనే డిమాండ్‌ను బీసీసీఐ పెట్టనుందని సమాచారం!.
భారత్ ఆడకపోతే అన్ని బోర్డులకు తీవ్ర నష్టం...
ఈ ఏడాది డిసెంబర్‌లో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లకుంటే క్రికెట్ ఆస్ట్రేలియా భారీ నష్టాలు చవిచూడనుంది. సుమారు రూ. 1900 కోట్ల ఆదాయం నష్టపోనుంది. రానున్న జూన్‌లో కోహ్లిసేన ద్వీపదేశం శ్రీలంకలో మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ సందిగ్ధంలో పడితే.. ఆ బోర్డు ప్రసార హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రారు.
ప్రసార హక్కుల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు 60 శాతం శ్రీలంక నష్టపోవాల్సి ఉంటుంది. ఆగస్టులో దక్షిణాఫ్రికాతో ఆడాల్సి మూడు టీ20 మ్యాచుల సిరీస్ వాయిదా/రద్దుగా ముగిస్తే దక్షిణాఫ్రికా ఆర్థిక నష్టాలు భరించాల్సి రావచ్చు. స్టార్ ఇండియా నుంచి సీఎస్‌ఏ భారీ కోత ఎదుర్కోవాల్సి రావచ్చు.
ప్రసార భాగస్వామి కోసం ఎదురుచూస్తున్న వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే క్రికెట్ బోర్డులు భారత్‌తో సిరీస్ ద్వారా మీడియా హక్కులు అమ్ముకునేందుకు చూస్తున్నాయి. లేదంటే కోవిడ్-19 కష్టకాలంలో మరింత కాలం ప్రసార భాగస్వామి లేకుండానే ప్రయాణం సాగించాల్సి ఉండవచ్చు.
వెస్టిండీస్ క్రికెట్ బోర్డు ఆరు నెలలుగా మీడియా భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ఫిబ్రవరి నుంచి శ్రీలంక బోర్డు ప్రసార హక్కులు మార్కెట్‌లో ఉంచింది. త్వరలోనే బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లు ప్రసార హక్కుల భాగస్వామి కోసం మార్కెట్‌లోకి రానున్నాయి.
ప్రస్తుత ఒప్పందాల ప్రకారం భారీ మొత్తాలు చెల్లించలేక కంపెనీలు చేతులెత్తేస్తున్నాయి. ఈ సమయంలో లాభదాయం కాని క్రికెట్ బోర్డుల ప్రసార హక్కులను పెద్ద మొత్తంలో సొమ్ము వెచ్చించి తీసుకునే పరిస్థితి కనిపించటం లేదు.
ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ అక్టోబర్‌లో జరగాల్సి ఉంది. వరల్డ్‌కప్ నిర్వహణతో వచ్చే ఆదాయ వాటా క్రికెట్ బోర్డుల రోజువారీ ఖర్చులకు సరిపోతుంది. కానీ క్రికెటర్లకు వేతనాలు, నిర్వహణ బోర్డులకు గుదిబండలా మారనున్నాయి. అందుకే ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు టీమ్ ఇండియాతో ఆట కోసం ఎదురుచూస్తున్నాయి.
మరో తాయిలం కూడా...!
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) ఆదాయ పంపిణీపై మరోసారి సమీక్ష చేయాలని బీసీసీఐ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు అన్ని దేశాలకు సముచిత వాటా దక్కేలా ఆదాయ పంపిణీ చేయాలని బీసీసీఐ సూచించినట్టు వార్తలొచ్చాయి.
అయితే దీనిపై బీసీసీఐ నుంచి ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లేదు.ఇప్పుడు ఐపీఎల్ కు అన్ని బోర్డులు మద్దతిస్తే... అన్ని దేశాలకు కూడా సముచితవాతను కల్పించేలా కృషి చేస్తామని బీసీసీఐ అన్ని దేశాల బోర్డులతో చెప్పినట్టు సమాచారం. ప్రస్తుతానికి భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లు మాత్రమే సింహభాగం మొత్తాన్ని స్వీకరిస్తున్నాయి.
మిగిలిన దేశాలకు పెద్దగా ఏమి దక్కడం లేదు. ఇలా వాటాలో ఎక్కువ మొత్తాలను ఇప్పిస్తామని చెప్పి కూడా క్రికెట్ బోర్డులను ఐపీఎల్ నిర్వహణకు ఒప్పించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తుంది.
ఐపీఎల్‌కు స్పెషల్ షెడ్యూల్ విండో.... క్రికెట్ బోర్డులు తమ నష్టాలు పూడ్చుకునేందుకు భారత్‌తో సిరీస్‌లు ఆడిస్తామని ఐసీసీ సమావేశం అనంతరం బీసీసీఐ నుంచి లీక్‌లు వెలువడ్డాయి.
బీసీసీఐకి ఏడాదికి రూ.3 వేల కోట్ల లాభం (ఆదాయం రూ.5600 కోట్లు) సంపాదించిపెట్టే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020 నిరవధికంగా వాయిదా పడింది. భారత్ అంతర్జాతీయ షెడ్యూల్‌లో స్వదేశంలో ఇంగ్లాండ్‌తో సిరీస్ ఆడాల్సి ఉంది.
ఆ సిరీస్ సాధ్యపడకపోయినా భారత్‌కు పెద్దగా నష్టం లేదు. అందుకే క్రికెట్ సీజన్ ప్రారంభానికి అనువైన పరిస్థితులు ఏర్పడిన వేళ ఐపీఎల్‌తోనే మొదలు పెట్టాలని బీసీసీఐ భావిస్తోంది.
అందుకు ఆసియా కప్, టీ20 వరల్డ్‌కప్‌లనైనా వాయిదా వేసేలా పావులు కదుపుతోంది. భారత్‌తో ద్వైపాక్షిక క్రికెట్ సంబంధాలు కోల్పోయిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మినహా అన్ని బోర్డులు బీసీసీఐ మాట పాటించేందుకు సదా సిద్ధంగా ఉన్నాయి.
ఐపీఎల్‌కు స్పెషల్ షెడ్యూల్ విండో కేటాయించేందుకు అంగీకారం తెలిపితే, అందుకు ప్రతిఫలంగా వారితో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనుంది. కరోనా కష్టకాలంలో ఆర్థిక సంక్షోభం గండం నుంచి గట్టెక్కించగల మహత్తార శక్తి బీసీసీఐకి ఎదురుచెప్పే సాహాసం ఐసీసీ సభ్య దేశాలు చేయబోవని చెప్పవచ్చు.