దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై దేశం అట్టుడుకుపోతుంది. ప్రతి ఒక్కరు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఘటన ను ఖండిస్తూ, ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నారు. 

సెలెబ్రిటీలు సైతం ఈ విషయమై స్పందిస్తున్నారు. సినిమా నుంచి మొదలుకొని క్రీడాకారుల వరకు ప్రతిఒక్కరూ ఈ హేయమైన చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. నిన్ననే ప్రియాంక రెడ్డి ఘటన పై విరాట్ కోహ్లీ స్పందించగా తాజాగా ఒక గంట కింద అంబటి రాయుడు సైతం స్పందించారు.    

కోహ్లీ స్పందన... 

ప్రియాంక రెడ్డి హత్యాచార ఘటనపై టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ట్విట్టర్ వేదికగా స్పందించాడు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  హైదరాబాద్‌లో ఇలాంటి ఘటన జరగడం ఎంతో సిగ్గుచేటంటూ విరాట్ ఈ ఘటనను ఖండించాడు. ఒక సమాజంగా మనమందరం బాధ్యత తీసుకొని ఇలాంటి అమానవీయ ఘటనలకు చరమ గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని, ఇప్పటికే ఆలస్యమైపోయిందని ట్వీట్ చేసాడు.  

అంబటి రాయుడు స్పందన...  

టీమిండియా క్రికెటర్‌ అంబటి రాయుడు సైతం ట్విట్టర్ వేదికగా తన స్పందనను పంచుకున్నాడు.అంబటి రాయుడు కూడా ఈ అమానుషకరమైన ఘటనపై తీవ్రంగా మండిపడ్డాడు. అత్యాచారం చేసిన వారి గురించి ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, అత్యాచార నిందితుల్ని ఉరి తీయాల్సిందేనని అన్నాడు.

ఎవరైనా మహిళ శరీరాన్ని దోచుకోవాలని ఆలోచించే వారికి వారి మెడ చుట్టూ బిగించిన ఉరితాడు గుర్తుకు రావాలని,  ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇప్పటికే ఆలస్యమైపోయిందని, ఆచరణలోకి దిగాల్సిందేనని అన్నాడు. వారికి ఉరి శిక్షే సరి అని రాసుకొచ్చాడు.