ముంబై: టీమిండియా ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి వైదోలుగుతున్నట్లు ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు తెలిపాడు. పీటీఐ వార్తా సంస్థతో ఆయన తన రిటైర్మెంట్ విషయాన్ని చెప్పాడు. 

ఇర్ఫాన్ పఠాన్ 2007 టీ20 ప్రపంచ కప్ ను గెలుచుకున్న జట్టులో ఉన్నాడు. భారత్ తరఫున అతను 29 టెస్టు మ్యాచులు, 120 వన్డే మ్యాచులు, 24 టీ20 మ్యాచులు ఆడాడు. 

ప్రపంచ కప్ పోటీల్లో భాగంగా కొలంబోలో దక్షిణాఫ్రికాపై 2012 అక్టోబర్ 2వ తేదీన జరిగిన టీ20 మ్యాచ్ అతనికి చివరిది. టెస్టు మ్యాచుల్లో హ్యాట్రిక్ సాధించిన ముగ్గురు ఎడమ చేతి వాటం భారత ఫాస్ట్ బౌలర్లలో ఇర్ఫాన్ పఠాన్ ఒకడు. 

పఠాన్ అడిలైడ్ లో ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచుతో అంతర్జాతీయ టెస్టు మ్యాచుల్లోకి అడుగుపెట్టాడు. రాహుల్ ద్రావిడ్ నేతృత్వంలోని భారత జట్టు ఈ టెస్టు మ్యాచు గెలుచుకుంది. మెల్బోర్న్ లో నెల తర్వాత అస్ట్రేలియాపై జరిగిన మ్యాచుతో వన్డే క్రికెట్ లో ఆరంగేట్రం చేశాడు. కపిల్ దేవ్ నిమష్క్రణ తర్వాత అంతటి ఆల్ రౌండర్ భారత్ ఇర్ఫాన్ పఠాన్ రూపంలో లభించాడు.