2020 టీ20 వరల్డ్‌కప్‌ అధికారికంగా వాయిదా పడింది. 2021, 2022 టీ20 ప్రపంచకప్‌ వేదికలపై నిర్ణయం గురించి ఆస్ట్రేలియా పట్టించుకోవడంలేదు కూడా. తాము ప్రపంచ కప్ నిర్వహణ కష్టం అని గతంలోనే చెప్పం అన్నట్టుగా వ్యవహరిస్తోంది క్రికెట్ ఆస్ట్రేలియా. 

ఇక టీ20 వరల్డ్‌కప్‌ వాయిదాతో మరో ప్రతిష్టాత్మక టీ20 లీగ్‌ ఐపీఎల్‌కు అధికారికంగా రంగం సిద్ధమవుతోంది. నవంబర్‌లో భారత టీం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఐపీఎల్  యూఏఈ నుండి నేరుగా ఆస్ట్రేలియాలో అడుగుపెట్టనుంది టీమ్‌ ఇండియా. 

టీమిండియా క్రికెటర్లు సహా యుఏఈలో ఐపీఎల్‌లో పాల్గొని స్వదేశానికి చేరుకునే ఆసీస్‌ క్రికెటర్లకు క్వారంటైన్‌ కేంద్రాన్ని క్రికెట్‌ ఆస్ట్రేలియా సిద్ధం చేస్తోంది. ఆడిలైడ్‌ ఓవల్‌ నార్త్‌కు ఇటీవల నూతనంగా నిర్మించిన ఐదు నక్షత్రాల హౌటల్‌లో భారత్‌, ఆస్ట్రేలియా క్రికెటర్లకు క్వారంటైన్‌ ఏర్పాటు చేసేందుకు సీఏ ప్రణాళిక తయారు చేస్తోంది. ఈ మేరకు క్రికెట్‌ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ వెల్లడించారు.

క్వారంటైన్ తప్పనిసరి.... 

భారత్‌ సహా ఐపీఎల్‌లో ఆడి స్వదేశానికి చేరుకునే ఆసీస్‌ క్రికెటర్లకు రెండు వారాల (14 రోజులు) క్వారంటైన్‌ తప్పనసరి అంటూ క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈఓ నిక్‌ స్పష్టం చేశాడు. క్వారంటైన్‌ సమయాన్ని కుదించాలని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ వ్యాఖ్యలకు నిక్‌ హాక్లీ బదులిచ్చారు. క్వారంటైన్‌ నిబంధనల విషయంలో ఎటువంటి మార్పులు ఉండబోవని వెల్లడించాడు.

'రెండు వారాల క్వారంటైన్‌ చాలా బాగా ప్లాన్‌ చేయబడింది. మేము చేయగలిగిదేది ఏమిటంటే క్వారంటైన్‌ సమయంలోనూ క్రికెటర్లు సాధన చేసుకునేందుకు అత్యుత్తమ సౌకర్యాలు కల్పించటం. దీంతో మ్యాచులకు సన్నద్ధం అయ్యేందుకు క్రికెటర్లకు గొప్ప అవకాశం లభిస్తుంది. ఇందుకోసం సీఏ ఆరోగ్య నిపుణులు, ప్రభుత్వ యంత్రాంగం సలహాలు తీసుకుంటాం. క్వారంటైన్‌కు సంబంధించి అది స్టేడియంలోని హోటల్‌ అయినా, స్టేడియంకు సమీపంలోని సదుపాయమైనా.. ఇన్‌ఫెక్షన్‌ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించే వాతావరణం అయి ఉండాలి. ఆ పని చేయలేకపోతే చాలా పెద్ద ప్రమాదంలో పడతాం' అని నిక్‌ అన్నారు.

ప్రయాణ ఆంక్షలు కూడా... 

ఉపఖండంలో కోవిడ్‌-19 కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. కేసుల రెట్టింపునకు పడుతున్న రోజులు చాలా తక్కువగా ఉంటోంది. ఆరు నెలల పాటు అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసిన ఆస్ట్రేలియా.. నవంబర్‌ సమయానికి సైతం ఆంక్షలు ఎత్తివేసే అవకాశం కనిపించటం లేదు!.

'ఆస్ట్రేలియాలోకి భారత్‌కు అడుగుపెట్టే సమయానికి ఇక్కడ అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు ఎత్తివేసే అవకాశం ఏమాత్రం లేదు. కచ్చితంగా రోగ నిర్ధారణకు సంబంధించి కొన్ని ప్రమాణాలు ఉండనున్నాయి. భారత జట్టు విమానం ఎక్కడానికి ముందే కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నాం, ఇక్కడ స్థానిక యంత్రాంగంతో కలిసి క్వారంటైన్‌ను పర్యవేక్షించనున్నాం. 

క్వారంటైన్‌లో ఉన్న ప్రతి ఆటగాడికి క్రమం తప్పకుండా కోవిడ్‌-19 నిర్ధారణ పరీక్షలు చేయనున్నాం. బయో సెక్యూర్‌ బబుల్‌ వాతావరణ సృష్టిలో ఇది అత్యంత కీలకం. ఐపీఎల్‌ జరిగే సమయంలోనే (సెప్టెంబర్‌ 26-నవంబర్‌ 7) ఆస్ట్రేలియా దేశవాళీ సీజన్‌ ఆరంభం కానుంది, దీంతో క్లబ్‌ ముఖ్యమా దేశం ముఖ్యమా అనే వాదన మొదలైంది. దీనిపై వ్యాఖ్యానించటం తొందరపాటు అవుతుంది. ఆసీస్‌ స్టార్‌ ఆటగాళ్లు ఐపీఎల్‌లో అత్యంత ముఖ్యమైన క్రికెటర్లు. ఆ విషయం మాకు తెలుసు. పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటాం. 

2021, 2022 టీ20 వరల్డ్‌కప్‌ ఆతిథ్య హక్కులపై సైతం ఆందోళన లేదు. 2021 ఆతిథ్య హక్కులు దక్కితే టోర్నీ నిర్వహణకు సర్వ సన్నద్ధంగా ఉన్నాం. 2022 ఆతిథ్య హక్కులు ఇస్తే మరింత ఘనంగా నిర్వహణకు వీలైనంత సమయం ఉంటుంది. పైగా కరోనా వైరస్‌ మహమ్మారి ఎంతకాలం ప్రభావం చూపిస్తుందో తెలియదు. ఈ సమయంలో ఆతిథ్య హక్కులు ఎప్పుడు లభించినా ఫర్వాలేదు' అని నిక్‌ పేర్కొన్నారు.