భారత జట్టు కోసం నూతన కోచింగ్ సిబ్బందిని ఎంపికచేయాలని బిసిసిఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ బాధ్యతను బిసిసిఐ కపిల్ దేవ్ నేతృత్వంలోని క్రికెట్ సలహా సంఘానికి అప్పగించింది. ఈ  కమిటీ ఇప్పటికే ఈ పదవుల కోసం దరఖాస్తులను ఆహ్వానించగా ఒక్క చీఫ్ కోచ్ పదవికే దాదాపు 2వేల దరఖాస్తులు వచ్చాయి. అయితే ఈ దరఖాస్తులను పరిశీలించి సీఏసీ సభ్యులకు ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి కంటే మెరుగైన అభ్యర్థి ఎవ్వరూ లేరన్న భావనకు వచ్చారట. దీంతో మళ్లీ రవిశాస్త్రినే చీఫ్ కోచ్ పదవికి ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

టీమిండియా కోచింగ్ సిబ్బంది ఎంపిక ప్రక్రియను చేపడుతున్న సీఏసీ కమిటీలో కపిల్ దేవ్ తో పాటు అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామి సభ్యులుగా వున్నారు. వీరందరు కూడా ఇప్పటికే పరోక్షంగా రవిశాస్త్రికి మద్దతిస్తూ వివిధ సందర్భాల్లో మాట్లాడారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ రవిశాస్త్రికే చీఫ్ కోచ్ గా  కొనసాగించాలన్న అభిప్రాయాన్ని తాము పరిగణలోకి తీసుకుంటామని కపిల్ దేవ్ ఓ సభలో మాట్లాడుతూ వెల్లడించారు. ఇక అన్షుమన్ గైక్వాడ్ కూడా దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుండగానే రవిశాస్త్రికి మద్దతుగా మాట్లాడాడు. దీంతో ఈ  కమిటీ మళ్లీ చీఫ్ కోచ్ గా రవిశాస్త్రినే కొనసాగించాలని ఆసక్తి కనబరుస్తున్నట్లు అర్థమవుతోంది. 

ఇక తాజాగా సీఏసి మెంబర్ ఒకరు టీమిండియా చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి ఎంపిక దాదాపు ఖరారైనట్లేనని అనధికారికంగా వెల్లడించినట్లు తెలుస్తోంది. భారత మాజీ చీఫ్ కోచ్ గ్యారీ కిర్‌స్టన్ వంటి విదేశీ దిగ్గజాలు ఈ చీఫ్  కోచ్ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే తాము మాత్రం విదేశీయులను కాకుండా మళ్లీ స్వదేశానికి చెందిన వ్యక్తినే చీఫ్ కోచ్ నియమించాలని భావిస్తున్నామని తెలిపారట. 

ఇక స్వదేశానికి చెందిన వారి దరఖాస్తులను పరిశీలిస్తే ప్రస్తుత  కోచ్ రవిశాస్త్రి కంటే మెరుగైన వారు ఎవరూ కనిపించడం లేదు. అంతేకాకుండా రవిశాస్త్రి పర్యవేక్షణలో  టీమిండియా ఆడిన మ్యాచులను ఓసారి పరిశీలిస్తే విజయాల శాతమే ఎక్కువగా వుంది. కాబట్టి అతన్నే మళ్లీ ఎందుకు కొనసాగించకూడదన్న నిర్ణయానికి తాము వచ్చినట్లు తెలిపారట. ఇలా ఇప్పటికే ముగిసన రవిశాస్త్రి కాంట్రాక్ట్ ను తిరిగి పనరుద్దరించనున్నట్లు సదరు సీఏసి మెంబర్ వెల్లడించినట్లు సమాచారం.