కరోనా కారణంగా ప్రపంచంలో అన్ని రకాల క్రీడలు వాయిదాపడ్డాయి. ఇందుకు క్రికెట్ సైతం అతీతం కాదు. దీంతో క్షణం తీరిక లేకుండా గడిపే క్రికెటర్లంతా ఇళ్లకే పరిమితమై, కుటుంబసభ్యులతో గడుపుతున్నారు.

అయితే కొన్ని దేశాల్లో లాక్‌డౌన్ సడలింపులు ఇవ్వడంతో ప్రజలు మళ్లీ సాధారణ జీవితాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కూడా పునరుద్ధరణలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

Also Read:లాక్‌డౌన్ సడలింపులు: దేశంలో క్రికెట్ మ్యాచ్‌లు ఎప్పుడంటే.. బీసీసీఐ క్లారిటీ

ఇప్పటి వరకు ఇళ్లకే పరిమితమైన ఆటగాళ్లకు ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రత్యేక ట్రైనింగ్ ఇవ్వాలని ఈసీబీ నిర్ణయించింది. దీనిలో భాగంగా ఇంగ్లాండ్‌లోని 7 మైదానాలను ఎంపిక చేసి 18 మంది బౌలర్లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లను పూర్తి చేసింది.

ఒక సమయంలో ఒక క్రికెటర్‌కు మాత్రమే మైదానంలో ప్రాక్టీస్ చేసే వెసులుబాటు కల్పించింది. సడలింపుల్లో భాగంగా స్టువర్ట్ బ్రాడ్, క్రిస్ వోక్స్‌లు మైదానంలోకి దిగి కాసేపు ప్రాక్టీస్ చేశారు.

Also Read:ఐసీసీ ఛైర్మన్ రేసులో గంగూలీ

బ్రాడ్ ట్రెంట్‌బ్రిడ్జిలో, వోక్స్ ఎడ్జ్‌బాస్టన్‌లో ప్రాక్టీస్ చేశారు. దీంతో కరోనా విరామం తర్వాత మైదానంలోకి దిగిన తొలి క్రికెటర్లుగా బ్రాడ్, వోక్స్‌లు నిలిచారు. దీనిపై స్పందించిన బ్రాడ్.. చాలా రోజుల తర్వాత మైదానంలోకి దిగి బౌలింగ్ చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నాడు. అంతేకాకుండా తను బౌలింగ్ చేసిన వీడియోను కూడా పోస్ట్ చేశాడు.