కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తున్న వేళ... ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ వైరస్ ను మహమ్మారిగా ప్రకటించేసింది. అప్పటినుండి క్రీడాభిమానుల్లో ఒకటే భయం నెలకొంది. ముఖ్యంగా క్రికెట్ అభిమానుల్లో... ఈ సంవత్సరం ఐపీఎల్ జరుగుతుందా లేదా అని. 

ఇప్పటికే కరోనా వైరస్ దెబ్బకు మహారాష్ట్రతో సహా మరో రెండు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో కరోనా విలయ తాండవం చేస్తున్న వేళ ఇలా ఐపీఎల్ మ్యాచులను నిర్వహించి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడలేమని కోర్టులకెక్కాయి. 

Also read: వీసాల పై భారత్ ఆంక్షలు: అయినా ఐపీఎల్ ఆడడానికి విదేశీ ఆటగాళ్లు ఎలా వస్తారంటే...

ఈ నేపథ్యంలో అందరూ అసలు ఐపీఎల్ జరుగుతుందా అని టెన్షన్ కి గురవుతున్నారు. అందరి అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ... భారత ప్రభుత్వ క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాలను జారీ చేసింది. 

ఎపిడెమిక్ డిసీజెస్ ఆక్ట్ 1897 కింద చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలను జారీ చేసింది. ఎక్కడ కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడా కూడా ఏ క్రీడా సంబరాన్ని వీక్షించడానికి కూడా ప్రజలు గుంపుగా చేరుకోవడానికి వీల్లేదని ఆ ఆదేశాలలో తెలిపారు. 

సాధ్యమైనంత వరకు ఆ క్రీడా సంగ్రామమే జరగకుండా చూస్తే మంచిదని, ఒక వేళ ఖచ్చితంగా జరుపుకోవాలిసి వస్తే... ప్రేక్షకులెవ్వరు కూడా లేకుండా క్రీడలను నిర్వహించాలని ఆదేశించింది. 

ఐపీఎల్ లాంటి క్రీడను నిర్వహించడం ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందునా ప్రేకధకులు లేకుండా అంటే... తడిసి మోపెడవుతుంది. ఆదాయం అటుంచితే భారీ స్థాయిలో నష్టం వాటిల్లుతుంది. 

దీనిపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం నిర్వహించి తదుపరి నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపింది. ఇప్పటికే ప్రపంచ షూటింగ్ ఛాంపియన్షిప్, సంతోష్ ట్రోఫీలు వాయిదా పడ్డాయి. 

ఈ ఆదేశాలు సత్వరం అమల్లోకి వస్తున్నందున, సౌతాఫ్రికాతో జరిగే రెండవ, మూడవ వన్డేలకు కూడా ప్రేక్షకులను అనుమతించరు. ఈ ఆదేశాల నేపథ్యంలో క్రీడాభిమానులు, ముఖ్యంగా క్రికెట్ అభిమానులు లబోదిబోమంటున్నారు.