Asianet News TeluguAsianet News Telugu

సూర్య కుమార్ యాదవ్ క్యాచ్ పై ఈ రచ్చేంటి..! కోడిగుడ్డుపై ఈకలు పీకుతున్నారుగా..!!

రోహిత్ సేన వన్డే వరల్డ్ కప్ ను మిస్ అయినా టీ20 వరల్డ్ కప్ ను మాత్రం మిస్ కాలేదు. సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో మ్యాచ్ ను మలుపుతిప్పే క్యాచ్ ను అందుకుని టీమిండియాకు చారిత్రాత్మక విజయం అందించాడు సూర్యకుమార్ యాదవ్. ఈ క్యాచ్ ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారింది. 

Controversy on Suryakumar Yadav Catch in India vs South Africa T20 World Cup Final  AKP
Author
First Published Jul 1, 2024, 5:32 PM IST

ICC T20 World Cup 2024 : టీమిండియాకు మరో టీ20 ప్రపంచ కప్ అందించిన క్యాచ్ అది... టైటిల్ పోరులో ఓటమి వైపు పయనిస్తున్న రోహిత్ సేనను విజయందిశగా నడిపిన క్యాచ్ అది... ప్రపంచ కప్ విజేతను నిర్ణయించే మ్యాచ్ ను మలుపుతిప్పిన క్యాచ్ అది...  యావత్ భారతావని సంబరాలు జరుపుకోడానికి కారణమైన క్యాచ్ అది... ఇలా టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ గురించి ఎంత గొప్పగా చెప్పినా తక్కువే. సూర్యకుమార్ పట్టింది కళ్లుచెదిరే క్యాచ్ కాదు... మొత్తం మ్యాచ్ నే పట్టేసాడు... వరల్డ్ కప్ తో పాటే ఫ్యాన్స్ మనసు కొట్టేసాడు.   

టీ20 ప్రపంచ కప్ టోర్నీ ఆద్యంతం అద్భుతంగా ఆడిన భారత్ ఓటమన్నదే లేకుండా విజయయాత్ర సాగించింది. అయితే ఫైనల్లో బలమైన ప్రత్యర్థి సౌతాఫ్రికాతో తలపడ్డ టీమిండియా కాస్త తడబడింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 176 పరుగులు చేసి 177 లక్ష్యాన్ని సౌతాఫ్రికా ముందుంచింది. అయితే సఫారీ బ్యాటర్లు డికాక్, క్లాసెస్, స్టబ్స్ రాణించడంతో లక్ష్యచేధన దిశగా ఇన్సింగ్స్ సాగింది. చివరి ఓవర్లో 16 పరుగులు చేయాల్సి వుంది...  క్రీజులో హిట్టర్ డేవిడ్ మిల్లర్ వున్నాడు... దీంతో ఏమవుతుందోనని ఉత్కంఠ ఏర్పడింది... ఇక్కడే సూర్యకుమార్ యాదవ్ మాయ చేసి మ్యాచ్ ను పూర్తిగా భారత్ వైపు తిప్పేసాడు. 

కీలకమైన చివర ఓవర్ ను హార్దిక్ పాండ్యాతో వేయించాడు కెప్టెన్ రోహిత్ శర్మ... అతడి నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఓ అద్భుతమైన బంతితో  తన పని ప్రారంభించాడు. అప్పటికే కేవలం 17 బంతుల్లో 21 పరుగులు (1 ఫోర్, 1 సిక్స్) బాది మంచి ఊపుమీదున్న మిల్లర్ మొదటి బంతికే భారీ హిట్ కు ప్రయత్నించాడు. ఆ బంతి బౌండరీవైపు దూసుకెళ్లింది... అంతా అది సిక్స్ అనుకున్నారు. కానీ ఇంతలోని సూర్యకుమార్ యాదవ్ మెరుపువేగంతో దూసుకువచ్చి బౌండరీపై కళ్ళుచెదిరే క్యాచ్ అందుకున్నాడు. బౌండరీ ఆవల పడబోయిన బంతిని అందుకున్న అతడు అదుపుతప్పి లైన్ దాటాడు.... ఈ సమయంలో బంతిని గాల్లో ఎగరేసి బౌండరీ అవతలికి వెళ్ళాడు... అదే వేగంగా మళ్ళీ మైదానంలో అడుగుపెట్టి బంతిని అందుకున్నాడు. దీంతో అసలేం జరిగిందో అర్థంకాక మిల్లర్ తో పాటు అంపైర్లు, ఆటగాళ్లు అవాక్కయి వుండిపోయారు. చివరకు అది క్యాచ్ గా గుర్తించిన మిల్లర్ పెవిలియన్ బాట పట్టాడు.

 

సూర్యకుమార్ యాదవ్ పట్టిన క్యాచ్ టీ20 ప్రపంచ కప్ విన్నర్ ను నిర్ణయించేది... కాబట్టి అంపైర్లు రిస్క్ తీసుకోదల్చుకోలేదు. దీంతో థర్డ్ అంపైర్ నిర్ణయం తీసుకున్నారు. ఒకటికి రెండుసార్లు సూర్యకుమార్ చేతిలో బంతి వున్నసమయంలో బౌండరీలైన్ కు తాకాడా? లేదా? అన్నది చూసుకున్నారు. అలా జరగలేదని నిర్దారించుకునే మిల్లర్ ఔట్ అయినట్లు ప్రకటించారు. దీంతో అప్పటివరకు సౌతాఫ్రికా చేతిలో వున్న మ్యాచ్ కాస్త భారత్ వైపు మొగ్గింది.  7 పరుగుల తేడాతో విజయం సాధించింది. 

చివరి ఓవర్లో ఇలా అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసిన సూర్యకుమార్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడు తీవ్ర ఒత్తిడి సమయంలోనూ సమయస్పూర్తితో సిక్స్ ను కాస్త క్యాచ్ మలిచిన  తీరును ప్రత్యర్థులు సైతం ప్రశంసిస్తున్నారు. కానీ ఈ క్యాచ్ ను కొందరు కావాలనే వివాదాస్పదం చేస్తున్నారు. ముఖ్యంగా ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కొందరు సౌతాఫ్రికన్ ఫ్యాన్స్ ఈ అద్భుతమైన క్యాచ్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 

సౌతాఫ్రికా ఫ్యాన్స్ అనుమానాలివే..: 

177 పరుగుల లక్ష్యచేధనలో సౌతాఫ్రికాకు చివరి ఆరు బంతుల్లో 16 పరుగులు కావాలి... ఈ సమయంలో హార్దిక్ పాండ్యా చేతికి బంతి అందించాడు రోహిత్. ఇలా చివరి ఓవర్లో మొదటి బంతికే క్రీజులో కుదురుకున్న మిల్లర్ భారీ షాట్ కు ప్రయత్నించి ఔటయ్యాడు. బౌండరీ వద్ద కళ్ళుచెదిరే క్యాచ్ అందుకున్నాడు సూర్యకుమార్ యాదవ్. అయితే క్యాచ్ పట్టే సమయంలో స్కై కాలు బౌండరీ లైన్ కు తాకిందన్నది సౌతాఫ్రికా ఫ్యాన్స్ అనుమానం.

అయితే ఓ యాంగిల్ లో చూస్తే సూర్యకుమార్ కాలు బౌండరీకి తాకినట్లుగా కనిపిస్తోంది... కానీ మరో యాంగిల్ లో స్పష్టంగా అతడు మైదానంలోనే వున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ బౌండరీ లైన్ కు సూర్యకుమార్ తాకినట్లుగా కనిపిస్తున్న యాంగిల్ లోని ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టీమిండియా తొండాట ఆడిందని... అంపైర్లు బిసిసిఐకి తలొగ్గారని ఆరోపిస్తున్నారు. సౌతాఫ్రికా ఫ్యాన్స్ కు మరికొందరు భారత ప్రత్యర్థులు తోడవడంతో ఈ క్యాచ్ పై వివాదం రాజుకుంది. 

ఇక మరికొందరయితే భారత్ కోసం ఏకంగా బౌండరీ లైన్ నే మార్చారంటూ ప్రచారం చేస్తున్నారు. బౌండరీ లైన్ ను మరింత దూరం జరిపారని... అందువల్లే మిల్లర్ కొట్టిన బంతి సిక్స్ వెళ్లకుండా సూర్యకుమార్ చేతిలో పడిందని అంటున్నారు. ఈ మేరకు బౌండరీ రోప్ జరిపినట్లుగా... ఈ రోప్ ముందున్న చోట తెల్లటి గుర్తులు వున్నట్లుగా ఓ ఫోటోను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఇలా టీమిండియాకు అంపైర్లు, ఐసిసి అనుకూలంగా వ్యవహరించారని... నిజానికి టీ20 వరల్డ్ కప్ గెలిచింది సౌతాఫ్రికా అంటూ ఆ దేశ క్రికెట్ ఫ్యాన్స్ ప్రచారం చేస్తున్నారు. 

టీమిండియా ఫ్యాన్స్ ఏమంటున్నారు..: 

సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ పై సాగుతున్న వివాదంపై మాజీ ఆటగాళ్లే కాదు టీమిండియా ఫ్యాన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఓటమిబాధలో వున్న సౌతాఫ్రికా ఫ్యాన్స్ తమను తాము సర్దిచెప్పుకోడానికి సూర్యకుమార్ క్యాచ్ పై వివాదం చేస్తున్నారని...దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. మరికొందరయితే కాస్త ఘాటుగా కోడుగుడ్డుపై ఈకలు పీకుతున్నట్లుగా ఈ వివాదం వుందని అంటున్నారు. కోట్లాదిమందికి కనిపించనిది కేవలం సౌతాఫ్రికా ఫ్యాన్స్ కే సూర్యకుమార్ బౌండరీ లైన్ కు తాకినట్లు కనిపిస్తోందని అంటున్నారు. టీమిండియా అద్భుతమైన ఆటతీరుతో టీ20 ప్రపంచకప్ మొత్తంలో ఆధిపత్యం ప్రదర్శించిందని... ఫైనల్లోనూ ఇలాంటి ఆటతోనే విజయం సాధించిందని అంటున్నారు.  

 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios