కామన్వెల్త్ గేమ్స్ కోసం ఎన్‌సీఏలో శిక్షణ తీసుకున్న భారత మహిళా క్రికెట్ టీమ్... ఇద్దరు ప్లేయర్లకు కరోనా సోకినట్టు నిర్ధారణ...
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ గేమ్స్ 2022కి ముందు భారత మహిళా క్రికెట్ టీమ్‌కి ఊహించని షాక్ తగిలింది. భారత జట్టులో ఇద్దరు ప్లేయర్లకు కరోనా పాజిటివ్‌గా తేలింది. బర్మింగ్‌హమ్‌లో జరిగే కామన్వెల్త్‌కి ముందు బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో శిక్షణ తీసుకుంది భారత మహిళాక్రికెట్ టీమ్...
ఈ శిక్షణలో పాల్గొన్న ఇద్దరు భారత మహిళా ప్లేయర్లు కరోనా పాజిటివ్‌గా తేలారు. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ ఎస్ మేఘనతో పాటు ఆల్‌రౌండర్ పూజా వస్త్రాకర్ కరోనా బారిన పడినట్టు సమాచారం. బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఈ విషయాన్ని ధృవీకరించాడు. కరోనా సోకిన ఈ ఇద్దరు ప్లేయర్లు, భారత్‌లోనే ఉండిపోగా మిగిలిన జట్టు కామన్వెల్త్ గేమ్స్ 2022 కోసం ఇంగ్లాండ్ చేరుకుంది...
కామన్వెల్త్ గేమ్స్ 2022లో భాగంగా జూలై 29న ఆస్ట్రేలియాతో మొదటి మ్యాచ్ ఆడుతోంది భారత జట్టు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్న భారత ప్లేయర్లు, కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత ఇంగ్లాండ్ బయలుదేరి, జట్టుతో కలుస్తారు... ఎస్ మేఘన కొంతకాలంగా సరైన ఫామ్‌లో లేదు. అయితే పూజా వస్త్రాకర్ మంచి ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరిగిన సిరీస్‌లోనూ ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్‌తో అదరగొట్టి భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించింది. ఆమె కీలక మ్యాచ్‌కి దూరం కావడం జట్టుపై ప్రభావం చూపే అవకాశం ఉంది.
కరోనా బారిన పడిన ఇద్దరు ప్లేయర్లు, ఆస్ట్రేలియాతో జరిగే మొదటి మ్యాచ్‌కి అందుబాటులో ఉండడం లేదు. అయితే ఆ తర్వాత జూలై 31న పాకిస్తాన్‌తో జరిగే మ్యాచ్ సమయానికి ఈ ప్లేయర్లు, జట్టుకి అందుబాటులోకి వస్తారని సమాచారం.
1998లో కౌల్హంపూర్‌లో కామన్వెల్త్ గేమ్స్‌లో పురుషుల వన్డే టోర్నీమెంట్ జరిగింది. అయితే వివిధ కారణాల వల్ల ఆ తర్వాత కామన్వెల్త్ గేమ్స్‌లో క్రికెట్ టోర్నీలు జరగలేదు. 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మహిళల టీ20 క్రికెట్‌ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ ఏడాది కామన్వెల్త్ గేమ్స్‌లో 8 మహిళా జట్టు పాల్గొనబోతున్నాయి. గ్రూప్ ఏలో భారత జట్టుతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా, బార్బడోస్ జట్లు ఉన్నాయి...
జూలై 29న ఆస్ట్రేలియాతో ఎడ్జ్‌బాస్టన్‌లో కామన్వెల్త్ గేమ్స్ 2022లో మొదటి మ్యాచ్ ఆడే భారత మహిళా జట్టు, ఆ తర్వాత జూలై 31న దాయాది పాకిస్తాన్‌తో తలబడుతుంది. ఆగస్టు 3న బార్బడోస్ టీమ్‌తో మ్యాచ్ ఆడుతుంది టీమిండియా...
కామన్వెల్త్ గేమ్స్‌కి ఎంపికైన భారత మహిళా పూర్తి జట్టు ఇదే: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), షెఫాలీ వర్మ, ఎస్ మేఘన, తానియా భాటియా, యషికా భాటియా, దీప్తి శర్మ, రాజేశ్వరి గైక్వాడ్, పూజా వస్త్రాకర్, మేఘా సింగ్, రేణుకా ఠాకూర్, జెమీమా రోడ్రిగ్స్, రాధా యాదవ్, హర్లీన్ డియోల్, స్నేహ్ రాణా
స్టాండ్ బై ప్లేయర్లు: సిమ్రాన్ దిల్ బహదూర్, రిచా ఘోష్, పూనమ్ యాదవ్
