ఉత్తరప్రదేశ్ లోని రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో పనిచేసే క్రికెట్ కోచ్ అక్కడ క్రికెట్ నేర్చుకుంటున్న మైనర్ బాలుడితో మసాజ్ చేయించుకున్నాడు.
ఓ క్రికెట్ కోచ్ వివాదంలో ఇరుక్కున్నాడు. పిల్లలకు క్రికెట్ ఎలా ఆడాలో నేర్పించాల్సింది పోయి... వారితో ఇతర పనులు చేయించుకున్నాడు. మైనర్ క్రికెటర్ తో... తన బాడీ మసాజ్ చేయించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఉత్తరప్రదేశ్ లోని రవీంద్ర కిషోర్ షాహీ స్పోర్ట్స్ స్టేడియంలో పనిచేసే క్రికెట్ కోచ్ అక్కడ క్రికెట్ నేర్చుకుంటున్న మైనర్ బాలుడితో మసాజ్ చేయించుకున్నాడు. వీడియో వైరల్ కావడంతో... ఆ కోచ్ ని సస్పెండ్ చేస్తూ... యూపీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్పీ సింగ్ నిర్ణయం తీసుకున్నారు.
ఈ ఘటనను సుమోటోగా తీసుకున్న పోలీసులు... కోచ్ అబ్దుల్ అహద్ ఫై కేసు నమోదు చేశారు. అతనిని విచారిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటన పై డిప్యూటీ స్పోర్ట్స్ డైరెక్టర్ ఆర్ఎన్ సింగ్ ను విచారణాధికారిగా నియమించినట్లు యూపీ స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రకటన విడుదల చేశారు.
కాగా... అబ్దుల్ ఆ స్టేడియంలో కోచ్ గా పనిచేస్తూనే... వార్డెన్ గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అక్కడ పిల్లలకు క్రికెట్ కోచింగ్ తో పాటు హాస్టల్ సదుపాయం కూడా ఉంది. దీంతో... అబ్దుల్ ఆ హాస్టల్ లో నే మకాం వేసి... తరచూ పిల్లలతో ఇలాంటి పనులు చేయించుకుంటున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
