ఐపీఎల్ 2021 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ బోణీ కొట్టింది. 107 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్, రుతురాజ్ గైక్వాడ్ వికెట్‌ను త్వరగా కోల్పోయింది. 16 బంతులు ఆడి 5 పరుగులే చేసిన రుతురాజ్, ఆర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో దీపక్ హుడాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.

ఆ తర్వాత డుప్లిసిస్, మొయిన్ ఆలీ కలిసి రెండో వికెట్‌కి 76 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. 31 బంతుల్లో 7 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 46 పరుగులు చేసిన మొయిన్ ఆలీ, మురుగన్ అశ్విన్ బౌలింగ్‌లో అవుట్ కాగా... షమీ బౌలింగ్‌లో సురేశ్ రైనా 8 పరుగులకే పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాతి బంతికే అంబటి రాయుడు గోల్డెన్ డకౌట్ అయ్యాడు. డుప్లిసిస్ 33 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 36 పరుగులు, సామ్ కుర్రాన్ 5 పరుగులు చేసి మ్యాచ్‌ను ముగించారు. 

టాస్ ఓడి, పంజాబ్ కింగ్స్‌కి బ్యాటింగ్ అప్పగించిన చెన్నై సూపర్ కింగ్స్, ప్రత్యర్థి జట్టును స్వల్ప స్కోరుకే పరిమితం చేసింది. దీపక్ చాహార్ బౌలింగ్ కారణంగా 26 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన పంజాబ్ కింగ్స్, షారుక్ ఖాన్ ఇన్నింగ్స్ కారణంగా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది.