Asianet News TeluguAsianet News Telugu

ఆసీస్‌తో మూడో వన్డే: మూడు వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా... ఆరేళ్ల తర్వాత స్టీవ్ స్మిత్ డకౌట్...

తొలి వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం జోడించిన ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్.. 3 వికెట్లు తీసిన హార్దిక్ పాండ్యా... ఆరేళ్ల తర్వాత వన్డేల్లో డకౌట్ అయిన స్టీవ్ స్మిత్.. 

Chennai INDvsAUS 3rd ODI: Hardik Pandya picks 3 wickets, Steve Smith goes for duck cra
Author
First Published Mar 22, 2023, 3:27 PM IST

చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియాకి ఓపెనర్లు శుభారంభం అందించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌కి తుది జట్టులో చోటు దక్కినా బీభత్సమైన ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌తో కలిసి ఓపెనర్‌గా వచ్చాడు ట్రావిస్ హెడ్...

ఓపెనర్లు ఇద్దరూ దూకుడుగా ఆడడంతో తొలి పవర్ ప్లే ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. అయితే 11వ ఓవర్‌లో బౌలింగ్‌కి వచ్చిన హార్ధిక్ పాండ్యా, టీమిండియాకి తొలి బ్రేక్ అందించాడు. 

31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 33 పరుగులు చేసిన ట్రావిస్ హెడ్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా స్ట్రైయిక్ క్యాచ్ డ్రాప్ చేయడంతో రెండు బంతుల ముందే లైఫ్ దక్కినా, దాన్ని సరిగ్గా వాడుకోలేకపోయాడు ట్రావిస్ హెడ్...

ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, 3 బంతులాడి డకౌట్ అయ్యాడు. హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు స్టీవ్ స్మిత్. వన్డే ఫార్మాట్‌లో స్టీవ్ స్మిత్ ఆరేళ్ల తర్వాత డకౌట్ అయ్యాడు. వన్డేల్లో స్టీవ్ స్మిత్‌ని అత్యధిక సార్లు అవుట్ చేసిన బౌలర్‌గా రెండో స్థానంలో నిలిచాడు హార్ధిక్ పాండ్యా...

ఇంగ్లాండ్ స్పిన్నర్ అదిల్ రషీద్, స్టీవ్ స్మిత్‌ని వన్డేల్లో ఆరు సార్లు అవుట్ చేయగా హార్ధిక్ పాండ్యా 5 సార్లు అవుట్ అయ్యాడు. మొయిన్ ఆలీ, ట్రెంట్ బౌల్ట్, మహ్మద్ షమీ, స్టువర్ట్ బ్రాడ్, మార్క్ వుడ్, ఉమేశ్ యాదవ్.. మూడేసి సార్లు స్టీవ్ స్మిత్‌ని వన్డేల్లో అవుట్ చేశారు..

గత రెండు మ్యాచుల్లో హాఫ్ సెంచరీలతో అదరగొట్టిన మిచెల్ మార్ష్, మూడో వన్డేలోనూ అదే దూకుడు కొనసాగించాడు. 47 బంతుల్లో 8 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 47 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, హార్ధిక్ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.. 3 వన్డేల్లో కలిపి 194 పరుగులు చేసిన మిచెల్ మార్ష్, టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 

2015లో స్కాట్లాండ్‌పై మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన డేవిడ్ వార్నర్, 8 ఏళ్ల తర్వాత మళ్లీ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్‌కి వచ్చాడు. 

22 ఓవర్లు ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది ఆస్ట్రేలియా. సుదీర్ఘమైన బ్యాటింగ్ లైనప్ ఉండడంతో ఆస్ట్రేలియా జట్టు ఇదే రకంగా నిలకడైన భాగస్వామ్యాలు నెలకొల్పితే ఈజీగా 250-300 పరుగుల స్కోరు చేసేలా కనిపిస్తోంది. 

Follow Us:
Download App:
  • android
  • ios