INDvsAUS 3rd ODI: టాస్ గెలిచిన ఆస్ట్రేలియా... ఐపీఎల్‌కి ముందు టీమిండియాకి ఫైనల్ మ్యాచ్...
చెన్నై వన్డే: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా కెప్టెన్ స్టీవ్ స్మిత్.. చెరో మ్యాచ్ గెలవడంతో సిరీస్ డిసైడర్‌గా మారిన ఆఖరి వన్డే...

చెన్నై వేదికగా టీమిండియాతో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మొదటి రెండు మ్యాచుల్లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న జట్లే, విజేతలుగా నిలిచాయి. అయితే మూడో వన్డేలో మాత్రం స్మిత్ భిన్నంగా ఆలోచించాడు. మొదటి వన్డేలో టీమిండియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించగా రెండో వన్డేలో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత జట్టును చిత్తు చేసింది. దీంతో నేటి మ్యాచ్ సిరీస్ డిసైడర్‌గా మారనుంది...
ఐపీఎల్ 2023 సీజన్‌కి ముందు టీమిండియా ఆడుతున్న ఆఖరి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్ తర్వాత రెండు నెలల పాటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో పాల్గొనే భారత క్రికెటర్లు, ఆ తర్వాత నేరుగా ఇంగ్లాండ్‌కి వెళ్లి ఆస్ట్రేలియాతో ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఆడతారు.. కాబటి సీజన్‌లో ఆఖరి మ్యాచ్‌ని విజయంతో ముగించాలని ఇరు జట్లు కూడా ఆశపడుతున్నాయి..
రెండో వన్డేలో టీమిండియా అన్ని విభాగాల్లోనూ అట్టర్ ఫ్లాప్ అయ్యింది. ఆస్ట్రేలియా బౌలర్లు, భారత బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన పిచ్ మీద భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్‌కి చెన్నై వన్డేలో చోటు దక్కవచ్చని ప్రచారం జరిగినా రోహిత్ శర్మ మాత్రం టీమ్‌లో మార్పులు చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదు. రెండో వన్డేలో ఆడిన జట్టునే, మూడో వన్డేలోనూ కొనసాగిస్తోంది టీమిండియా...
ఆస్ట్రేలియా మూడో వన్డేకి ముందు రెండు మార్పులతో బరిలో దిగుతోంది. గాయం కారణంగా చివరి రెండు టెస్టులకు, మొదటి రెండు వన్డేలకు దూరమైన డేవిడ్ వార్నర్ నేటి మ్యాచ్‌లో బరిలో దిగుతున్నాడు. కామెరూన్ గ్రీన్ స్థానంలో డేవిడ్ వార్నర్‌ని తుది జట్టులోకి తీసుకొచ్చిన ఆస్ట్రేలియా, నాథన్ ఎల్లీస్ ప్లేస్‌లో అస్టన్ అగర్‌ని తీసుకొచ్చింది..
రెండో వన్డేలో భారత బ్యాటర్లు మూకుమ్మడిగా ఫెయిల్ అయ్యారు. విరాట్ కోహ్లీ 31, అక్షర్ పటేల్ 29 పరుగులతో టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న శుబ్‌మన్ గిల్, తొలి రెండు మ్యాచుల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. రెండు వన్డేల్లోనూ మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లోనే లబుషేన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు శుబ్‌మన్ గిల్...
శిఖర్ ధావన్‌ని పక్కనబెట్టి శుబ్‌మన్ గిల్‌పై బోలెడు ఆశలు పెట్టుకుని, వన్డే వరల్డ్ కప్ ఆడించాలని ఫిక్స్ అయిన బీసీసీఐ.. స్వదేశంలో జరుగుతున్న ఈ సిరీస్‌లో అతని ఫెయిల్యూర్ చూసి ఆశ్చర్యపోతోంది.. నేటి మ్యాచ్‌లో టీమిండియా గెలిచి, సిరీస్‌ని సొంతం చేసుకోవాలంటే బ్యాటింగ్‌లోనూ టీమిండియా టాప్ క్లాస్ పర్ఫామెన్స్ చూపించాల్సి ఉంటుంది.
ఆస్ట్రేలియా జట్టు: డేవిడ్ వార్నర్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ (కెప్టెన్), మార్కస్ స్టోయినిస్, మార్నస్ లబుషేన్, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్), అస్టన్ అగర్, సీన్ అబ్బాట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా
భారత జట్టు ఇది: రోహిత్ శర్మ (కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్ధిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్