Chandrakant Pandit: ఇటీవలే ముగిసిన రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తలరాత మార్చాడు ఆ జట్టు హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్. అయితే చాలాకాలంగా కోచ్ గా సేవలందిస్తున్న ఆయన.. ఐపీఎల్ లో మాత్రం కనిపించలేదు.
దేశవాళీ క్రికెట్ లో కోచ్ గా తన ఆరో టైటిల్ ను అందుకున్న మధ్యప్రదేశ్ హెడ్ కోచ్ చంద్రకాంత్ పండిట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు. 23 ఏండ్ల క్రితం తాను కెప్టెన్ గా కోల్పోయిన ట్రోఫీని కోచ్ గా అందుకున్న ఆయన ప్రయాణం స్ఫూర్తివంతం. అయితే ఈ మధ్యప్రదేశ్ మాజీ కెప్టెన్.. కోచ్ గా ఆరు రంజీ ట్రోఫీలు అందించినా క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్ లో మాత్రం కనిపించలేదు. భారత జట్టు తరఫున గతంలో ఐదారు మ్యాచులాడిన ఆటగాళ్లే వివిధ ఫ్రాంచైజీలకు కోచింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్న వేళ.. చంద్రకాంత్ పండిట్ ఈ లీగ్ లో భాగం కాకపోవడానికి గల కారణాలను వివరించాడు.
ఐపీఎల్ లో తానెందుకు పనిచేయలేదనే విషయంపై వివరిస్తూ.. ‘నేను ఏదైనా ఐపీఎల్ ఫ్రాంచైజీకి ఫోన్ చేస్తే వాళ్లు నాకు కచ్చితంగా కోచ్ గా అవకాశమిస్తారు. కానీ అది నా పద్ధతి కాదు..’ అని తెలిపాడు.
గతంలో తాను కోల్కతా నైట్ రైడర్స్ కో ఓనర్ గా ఉన్న షారుఖ్ ఖాన్ కూడా కలిశానని.. ఆ సందర్భంగా తనకు కోచింగ్ పదవి అప్పజెప్పినా తాను అంగీకరించలేదని చంద్రకాంత్ అన్నాడు. ‘నేను 2012లో కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ను కలిశాను. అయితే అప్పుడు ఆయన నాకు కోచింగ్ టీమ్ లోకి రమ్మన్నారు. కానీ నేను మాత్రం అంగీకరించలేదు. నేను ఫారెన్ కోచ్ ల కింద పని చేయదలుచుకోలేదు..’ అని చెప్పాడు.
2012లో కేకేఆర్ కు ట్రెవర్ బెయిలిస్ హెడ్ కోచ్ గా వ్యవహరించాడు. ఆస్ట్రేలియాకు చెందిన ట్రెవర్.. 2015 నుంచి 2019 వరకు ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు కోచ్ గా పనిచేశాడు. అతడి కింద పనిచేయడానికి చంద్రకాంత్ అంగీకరించలేదు.
ఇదిలాఉండగా గతంలో తాను ఐదు రంజీ ట్రోఫీలు గెలిచిన జట్లకు హెడ్ కోచ్ గా ఉన్నా మధ్యప్రదేశ్ కు ట్రోఫీని అందించడం మాత్రం చాలా ప్రత్యేకమని అంటున్నాడు చంద్రకాంత్. ‘నా కెరీర్ లో ముంబైకి హెడ్ కోచ్ గా పనిచేసినప్పుడు 3 ట్రోఫీలు, విదర్భకు 2, మధ్యప్రదేశ్ కు 1 అందించాను. వీటిలో వేటికవే ప్రత్యేకం. కానీ ఇటీవల మధ్యప్రదేశ్ కు టైటిల్ అందించడం మాత్రం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే ఇది నా సొంత జట్టు. గతంలో కెప్టెన్ గా ఉండి నేను సాధించలేనిది ఇప్పుడు సాధించుకున్నాను. ఇన్నాళ్లు నాకు అది చాలా వెలితిగా ఉండేది. కానీ ఇప్పుడది తీరిపోయింది..’ అని తెలిపాడు.
