ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలుపుతో దేశమంతా పండగ చేసుకుంటోంది. రాజకీయ నాయకుల నుంచి సామాన్యుల వరకు టీమ్ ఇండియా గెలుపుతో గర్వపడుతున్నారు. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు టీమిండియా ప్లేయర్స్ కు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియా వేదికగా పోస్ట్‌లు చేశారు..
ఛాంపియన్స్ ట్రోఫీ 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్లో న్యూజిలాండ్ ను ఓడించి భారత్ ఛాంపియన్ అయింది. టీమ్ ఇండియా గెలుపుతో దేశమంతా సంబరాలు చేసుకుంటున్నారు. క్రికెట్ అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా టీమ్ ఇండియాకు అభినందనలు తెలుపుతూ ఆటగాళ్ల ప్రదర్శనపై ప్రశంసలు కురిపించారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము టీమ్ ఇండియా గెలుపును చరిత్రలో నిలిచిపోయేలా చేసిందని అన్నారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన టీమ్ ఇండియాకు అభినందనలు. మూడుసార్లు ట్రోఫీ గెలిచిన ఏకైక జట్టుగా భారత్ నిలిచింది. ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి అభినందనలు. భారత క్రికెట్ భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. అంటూ పోస్ట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ సంతోషం
టీమ్ ఇండియా గెలుపుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ.. అద్భుతమైన ఆట, అద్భుతమైన ఫలితం. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని ఇంటికి తెచ్చినందుకు మన క్రికెట్ జట్టు పట్ల గర్వంగా ఉంది. టోర్నమెంట్లో అద్భుతంగా ఆడారు. మన జట్టుకు అభినందనలు. అని రాసుకొచ్చారు.
రాహుల్ గాంధీ అభినందనలు
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ టీమ్ ఇండియా గెలుపుపై ట్వీట్ చేశారు. అదరగొట్టారు అబ్బాయిలూ! మీరంతా ఒక బిలియన్ గుండెల్ని గర్వపడేలా చేశారు. టోర్నమెంట్లో టీమ్ ఇండియా అద్భుత ప్రదర్శన కనబరిచింది. వ్యక్తిగత ప్రదర్శనలు, మైదానంలో ఆధిపత్యం స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అభినందనలు ఛాంపియన్స్! అని వ్యాఖ్యానించారు
అమిత్ షా ప్రశంసలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా భారత జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇది చరిత్ర సృష్టించిన విజయం. ఐసీసీ #ChampionsTrophy2025లో అద్భుత విజయం సాధించినందుకు టీమ్ ఇండియాకు అభినందనలు. మీ ఆటతీరు దేశానికి గర్వకారణం. క్రికెట్ లో మీరు ఎప్పుడూ ఇలాగే రాణించాలని కోరుకుంటున్నాను. అని అన్నారు.