Asianet News TeluguAsianet News Telugu

టీమిండియా క్లీన్ స్వీప్ ను అడ్డుకున్న చమరి.. ఇండియాపై లంకకు తొలి గెలుపు..

INDW vs SLW T20I: వరుసగా రెండు టీ20లు గెలిచి  మూడోదాంట్లో కూడా విజయం సాధించి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని భావించిన భారత మహిళా క్రికెటర్లకు చివరి మ్యాచ్ లో షాక్ తగిలింది. 
 

Chamari Athapaththu Helps Sri Lanka To beat India By 7 Wickets, India Clinches The Series with 2-1 Lead
Author
India, First Published Jun 27, 2022, 6:33 PM IST

శ్రీలంక పర్యటనలో ఉన్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ఊహించని షాక్ తగిలింది. ఆతిథ్య జట్టుపై వరుసగా రెండు మ్యాచులు గెలిచిన హర్మన్ ప్రీత్ సేన ఆఖరి టీ20లో మాత్రం తడబడింది. ముందు బ్యాటింగ్ లో విఫలమైన భారత జట్టు ఆ తర్వాత బౌలింగ్ లో కూడా పట్టువదిలి సిరీస్ క్లీన్ స్వీప్ చేసే అవకాశాన్ని కోల్పోయింది.  దంబుల్లా వేదికగా జరిగిన మూడో టీ20 లో శ్రీలంక మహిళల జట్టు..  భారత్ పై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. అనంతరం లంక.. 17 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ఫార్మాట్ లో భారత్ పై లంకకు ఇది స్వదేశంలో తొలి విజయం కావడం గమనార్హం.  

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన భారత జట్టుకు ఆది నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఓపెనర్ షఫాలీ వర్మ (5) తో తొలి ఓవర్లోనే వెనుదిరిగింది. ఆ తర్వాత స్మృతి మంధాన (22.. 3 ఫోర్లు), సబ్బినేని మేఘన (22.. 3 ఫోర్లు) రెండో వికెట్ కు 41 పరుగులు జోడించారు. కానీ వెంటవెంటనే వీరు ఔటయ్యారు. 

కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (33 బంతుల్లో 39 నాటౌట్.. 3 ఫోర్లు, 1 సిక్సర్), జెమీమా రోడ్రిగ్స్ (30 బంతుల్లో 33.. 3 ఫోర్లు) చివర్లో నెమ్మదిగా ఆడారు. దీంతో భారత జట్టు భారీ స్కోరు చేయలేకపోయింది.  లంక బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసి భారత్  బ్యాటర్లను అడ్డుకున్నారు. 

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో లంక కూడా తొలి ఓవర్లోనే విష్మి గుణరత్నె (5) వికెట్ కోల్పోయినా.. ఆ జట్టు కెప్టెన్ చమరి ఆటపట్టు (48 బంతుల్లో 80.. 14 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడి లంకకు ఊరట విజయాన్ని అందించింది.  ఆమెకు నీలాక్షి డి సిల్వ (30.. 4 ఫోర్లు) తోడుగా నిలిచింది. ఈ ఇద్దరూ మూడో వికెట్ కు 87 పరుగులు జోడించారు. భారత బౌలర్లలో రాధా యాదవ్, దీప్తి శర్మ లు భారీగా పరుగులిచ్చుకున్నారు. 

 

తాజా ఫలితంతో ఈ సిరీస్ లో భారత జట్టు 2-1తో సిరీస్ ను గెలుచుకుంది.  చివరి మ్యాచ్ లో రాణించిన చమరికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగా టీమిండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ దక్కింది.  ఈ పర్యటనలో భారత జట్టు జులై 1, 4, 7 తేదీలలో  లంకతో మూడు వన్డేలు ఆడుతుంది. ఈ మ్యాచులన్నీ పల్లెకెలె వేదికగా జరుగుతాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios