World Test Championship: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2021-23 సీజన్ లో భాగంగా టెస్టులు ఆడుతున్న పలు జట్లు ఫైనల్ కు చేరడానికి సిద్ధపడుతున్నాయి. మరి ఇండియా ఫైనల్ కు చేరే ఛాన్స్ ఉందా..? ఉంటే ఎలా..?
గతేడాది ఐసీసీ తొలిసారి నిర్వహించిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2021 ఫైనల్ లో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. వచ్చే సీజన్ లో అయినా ఈ ట్రోఫీ నెగ్గాలని టార్గెట్ గా పెట్టుకుంది. అయితే గతేడాదిగా టీమిండియాలో జరుగుతున్న పరిణామాలు.. టెస్టులలో ఓటములు.. కెప్టెన్సీ మార్పు.. తదితర విషయాలు మాత్రం భారత లక్ష్యానికి సుదూరంగా నిలుస్తున్నాయి. తాజాగా ఇంగ్లాండ్ తో ఎడ్జబాస్టన్ టెస్టులో కూడా ఓడటంతో టీమిండియా ఆశలు మరింత క్లిష్టమయ్యాయి. అసలు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్-2023 ఫైనల్ కు టీమిండియా వెళ్లగలదా..? ఆ మేరకు అవకాశాలు ఎలా ఉన్నాయి.
ఈ సీజన్ (2021-23) లో భారత జట్టు 12 టెస్టులు ఆడిన టీమిండియా, 6 విజయాలు అందుకుని, 4 మ్యాచుల్లో ఓడింది. 2 టెస్టులను డ్రా చేసుకోగలిగింది. ప్రస్తుతం 52.08 విజయాల శాతంతో నాలుగో స్థానంలో ఉన్నది. కానీ ఆడిన 7 టెస్టులలో 3 గెలిచి, రెండింట్లో ఓడి, రెండు టెస్టులను డ్రా చేసుకున్న పాకిస్తాన్.. 52.08 విజయాల శాతంతో టాప్ 3 లో నిలిచింది.
భారత్ ఫైనల్ కు వెళ్లాలంటే..?
భారత జట్టు నవంబర్ లో బంగ్లాదేశ్ తో రెండు టెస్టులు, ఆ తర్వాత స్వదేశంలో ఆస్ట్రేలియాతో 4 టెస్టులు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచుల్లో టీమిండియా నెగ్గితే అప్పుడు మన విజయాల శాతం 68.06 శాతంగా ఉంటుంది. ఈ ఆరింటిలో ఐదు మ్యాచులలో నెగ్గితేనే భారత జట్టు ఫైనల్ చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. వాస్తవంగా చూస్తే ప్రస్తుతం పాయింట్ల పట్టికలో టాప్-3లో ఉన్న ఆసీస్, దక్షిణాఫ్రికా, పాకిస్తాన్ కు మనకంటే అవకాశాలు ఎక్కువున్నాయి. కానీ రాబోయే మ్యాచులలో మిగతా మూడు జట్ల విజయాలు, పరాజయాలు కూడా ఫైనల్ అవకాశాలను ప్రభావితం చేస్తాయి.
ఆస్ట్రేలియా కు లైన్ క్లీయర్..
ఈ రేసులో ఆసీస్ అగ్రస్థానంలో ఉంది. కంగారూలకు ఇంకా పది మ్యాచులున్నాయి. అందులో ఇండియాతో నాలుగు టెస్టులు మినహాయిస్తే మిగతా ఐదులో వెస్టిండీస్ తో రెండు, సౌతాఫ్రికాతో మూడు మ్యాచులను స్వదేశంలోనే ఆడాల్సి ఉంది. స్వదేశంలో కంగారూలను ఓడించడం అంత సులభమేమీ కాదు. ఈ సీజన్ లో రాబోయే ఆరు మ్యాచులలో ఇండియా గెలిచి.. ఆసీస్ నాలుగు మ్యాచులు ఓడితే మాత్రం భారత జట్టు ఆసీస్ ను అధిగమించి అగ్రస్థానానికి చేరే అవకాశముంది.
సౌతాఫ్రికా..
ఇండియాను 1-2తో దెబ్బకొట్టిన సఫారీలు తర్వాత ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ లతో 8 టెస్టులు ఆడాల్సి ఉంది. ఇందులో కనీసం నాలుగు గెలిచినా సఫారీలకు ఫైనల్ చేరే అవకాశం దక్కుతుంది.
పాకిస్తాన్..
ప్రస్తుతం పాకిస్తాన్ ఏడు మ్యాచులాడి 3 గెలిచి రెండిట్లో ఓడి, రెండింటిని డ్రా చేసుకుంది. పాక్ ఈ నెలలో శ్రీలంకతో రెండు టెస్టులు ఆడనుంది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో మూడు, న్యూజిలాండ్ తో రెండు మ్యాచులు ఆడుతుంది. ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తో మ్యాచ్ లు స్వదేశంలోనే జరుగుతాయి. ఈ ఏడింటిలో పాక్.. ఆరు గెలిస్తేనే ఫైనల్ చేరే అవకాశాలుంటాయి.
