టెస్టుల్లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేసుకున్న కామెరూన్ గ్రీన్... ఉస్మాన్ ఖవాజాతో కలిసి ఐదో వికెట్‌కి డబుల్ సెంచరీ భాగస్వామ్యం... ఐదో వికెట్ కోసం పడిగాపులు కాస్తున్న టీమిండియా.. 

ఇండోర్ టెస్టులో గెలిచి కమ్‌బ్యాక్ ఇచ్చిన ఆస్ట్రేలియా, అహ్మదాబాద్ టెస్టులో పట్టు సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, తొలి రోజు ఆటలో 4 వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో ఆసీస్ బ్యాటర్లు, భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నారు...

ఉస్మాన్ ఖవాజా 150 మార్కు దాటేయగా, కామెరూన్ గ్రీన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 143 బంతుల్లో శతకాన్ని అందుకున్న ఉస్మాన్ ఖవాజా, టెస్టు కెరీర్‌లో మొట్టమొదటి సెంచరీ నమోదు చేశాడు. భారత పర్యటనలో తొలి సెంచరీ చేసిన ఆరో ఆస్ట్రేలియా బ్యాటర్‌గా రికార్డు నమోదు చేశాడు కామెరూన్ గ్రీన్...

ఇంతకుముందు లెస్ ఫవెల్, పాల్ సెహన్, డీన్ జోన్స్, మైకెల్ క్లార్క్, గ్లెన్ మ్యాక్స్‌వెల్... భారత పర్యటనలో మొట్టమొదటి టెస్టు సెంచరీ నమోదు చేశారు. మరో ఎండ్‌లో ఉస్మాన్ ఖవాజా 366 బంతుల్లో 20 ఫోర్లతో 157 పరుగులు చేయగా కామెరూన్ గ్రీన్ 159 బంతుల్లో 18 ఫోర్లతో 111 పరుగులు చేశారు. ఈ ఇద్దరూ ఐదో వికెట్‌కి అజేయంగా 200 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు...

భారత్‌ పర్యటనలో ప్రత్యర్థి ఆటగాళ్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఒకటి కంటే ఎక్కువ సెంచరీలు చేయడం గత దశాబ్ద కాలంలో ఇది ఐదోసారి. ఇంతకుముందు 2017లో రాంఛీ టెస్టులో స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీలు చేయగా, ఐదేళ్లకు ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్ ఆస్ట్రేలియా తరుపున ఈ ఫీట్ సాధించారు... ఓవర్‌నైట్ స్కోరు 255/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాని భారత బౌలర్లు ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోతున్నారు.

మహ్మద్ షమీ, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, ఉమేశ్ యాదవ్... ఇలా ఇన్ని బౌలింగ్ మార్పులు చేసినా టీమిండియాకి వికెట్ మాత్రం దక్కడం లేదు... ఈ సిరీస్‌లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం. ఇంతకుముందు ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్ కలిసి 8వ వికెట్‌కి 114 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఆ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేసిన ఉస్మాన్ ఖవాజా, కామెరూన్ గ్రీన్... ఆస్ట్రేలియాకి కొండంత స్కోరు అందించే దిశగా సాగుతున్నారు. 

పిచ్ నుంచి ఎలాంటి సహకారం లభించకపోవడంతో భారత బౌలర్లు, రెండో రోజు మొదటి 45 ఓవర్లలో వికెట్ తీయలేకపోయారు. తొలి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, రెండో సెషన్‌లోనూ అదే దూకుడు కొనసాగిస్తోంది. ఆసీస్ ఈ రోజు మొత్తం బ్యాటింగ్ చేస్తే, ఈజీగా 450-500 స్కోరు చేయడం ఖాయం. ఇదే జరిగితే టీమిండియా కష్టాల్లో పడుతుంది...

నాగ్‌పూర్ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 400 స్కోరు చేసిన భారత జట్టు, ఆ తర్వాత ఏ ఇన్నింగ్స్‌లోనూ ఆ మార్కుకి దగ్గర కూడా రాలేకపోయింది. అహ్మదాబాద్ టెస్టులో పిచ్ బ్యాటింగ్‌కి అద్భుతంగా అనుకూలిస్తున్నా, భారత బ్యాటర్లు ఎలా ఆడతారో అంచనా వేయడం కష్టం. అదీకాకుండా మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు అనుకూలించవచ్చు. అదే జరిగితే భారత జట్టు కష్టాలు పెరుగుతాయి..