Asianet News TeluguAsianet News Telugu

Ravindra Jadeja: నా వల్ల కాదు.. నువ్వే తీసుకో.. సీఎస్కే పగ్గాలు వదిలేసిన జడ్డూ.. తిరిగి ధోనికే..

Ms Dhoni: డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై  సూపర్ కింగ్స్ జట్టులో మరో  ట్విస్ట్. ఈ సీజన్ కు ముందు  చెన్నైకి సారథి గా నియమితుడైన  రవీంద్ర జడేజా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. 

Breaking : Ravindra Jadeja Handover CSK Captaincy to MS Dhoni
Author
India, First Published Apr 30, 2022, 7:31 PM IST | Last Updated Apr 30, 2022, 7:58 PM IST

చెన్నై సూపర్ కింగ్స్  కు బిగ్ షాక్. ఈ సీజన్ కు కొద్దిరోజులు ముందు ఆ జట్టుకు సారథిగా నియమితుడై రవీంద్ర జడేజా.. తాజాగా ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. వాటిని తిరిగి మాజీ సారథి  మహేంద్ర సింగ్ ధోనికే అప్పజెప్పాడు.  ఈ మేరకు సీఎస్కే అధికారిక ట్విటర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ సీజన్ లో వరుస ఓటములతో  ప్లేఆఫ్ ఆశలు దాదాపు అడుగంటిన వేళ జడ్డూ.. అనూహ్యంగా  నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకోవడవం గమనార్హం. ఈ సీజన్ లో సీఎస్కే.. 8 మ్యాచులాడి 6 మ్యాచుల్లో ఓడి 2 మాత్రమే గెలిచింది.  పాయింట్ల పట్టికలో  9వ స్థానంలో నిలిచింది. 

అయితే సీఎస్కే తన ట్విటర్ ఖాతా వేదికగా స్పందిస్తూ.. ‘రవీంద్ర జడేజా తన ఆటపై పూర్తి దృష్టి  పెట్టాలని భావిస్తున్నాడు.  దీంతో అతడు తిరిగి ధోనినే కెప్టెన్ గా ఉండాలని అభ్యర్థించాడు.  ధోని దీనికి అంగీకరించాడు..’ అని తెలిపింది. 

ధోని కెప్టెన్సీలో నాలుగు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచిన  సీఎస్కే.. ఈ సీజన్ కు ముందు రవీంద్ర జడేజాకు సారథ్య బాధ్యతలను అప్పజెప్పింది.  ధోని వారసత్వాన్ని అతడు కొనసాగిస్తాడని భావించింది. జడ్డూ కూడా  తనకు సారథ్యం అప్పగించడంపై  సంతోషంగానే ఉన్నట్టు తెలిపాడు. కానీ ఫలితాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వచ్చాయి.  తొలి మ్యాచ్ లో కోల్కతా చేతిలో ఓడిన  తర్వాత కూడా   పరాజయాల పరంపరను కొనసాగించింది. 

 

వరుసగా నాలుగు ఓటముల తర్వాత ఆర్సీబీ తో మ్యాచ్ ను ఎట్టకేలకు గెలిచిన సీఎస్కే.. తర్వాత కూడా దానినే కొనసాగించింది. ఇక ఐపీఎల్ లో అత్యంత ప్రతిష్టాత్మక పోరుగా భావించిన ముంబై - చెన్నై పోరులో ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన  మ్యాచ్ లో ఫినిషింగ్ కింగ్ ధోని పుణ్యమా అని  ఆ మ్యాచ్ నెగ్గింది. కానీ మళ్లీ పంజాబ్ పై అదే తడబాటు. 

గతంలో బంతితో పాటు బ్యాటర్ గా విలువైన పరుగులు చేసిన జడ్డూ.. ఈ సీజన్ లో మాత్రం దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ సీజన్ లో 8 మ్యాచులాడిన జడ్డూ.. 8 ఇన్నింగ్స్ లలో 112 పరుగులు మాత్రమే చేశాడు. అదీ కష్టంగానే వచ్చాయి.  కెప్టెన్సీ ప్రభావం జడేజా మీద తీవ్రంగా పడింది.  బ్యాటర్ గా విఫలమైన జడ్డూ.. సారథిగా కూడా రాణించలేకపోయాడు.  మరో ఆరు మ్యాచులు మిగిలుండగా జడేజా.. ఇక ఈ భారం తన వల్ల కాదంటూ  ఆ  బాధ్యతలను తిరిగి ధోనికే అప్పగించడం గమనార్హం.  ఒత్తిడిని తట్టుకోలేకే జడ్డూ.. నాయకత్వ పగ్గాలను తిరిగి ధోనికి అప్పగించాడనేది చెన్నై అభిమానుల టాక్. 

ఐపీఎల్-15లో సీఎస్కే.. 

- కేకేఆర్ తో.. 6 వికెట్ల తేడాతో పరాజయం 
- లక్నోతో.. 6 వికెట్ల పరాజయం 
- పంజాబ్ తో.. 54 పరుగుల తేడాతో ఓటమి 
- ఎస్ఆర్హెచ్ తో.. 8 వికెట్ల తేడాతో ఓటమి 
- ఆర్సీబీ తో.. 23 పరుగుల తేడాతో గెలుపు 
- గుజరాత్ తో.. 3 వికెట్ల తేడాతో పరాజయం 
- ముంబైతో.. 3 వికెట్ల తేడాతో గెలుపు 
- పంజాబ్ తో.. 11 పరుగుల తేడాతో ఓటమి 

 
మొత్తంగా ఈ సీజన్ లో 8 మ్యాచులాడిన సీఎస్కే.. 2 విజయాలు, 6 పరాజయాలతో 4 పాయింట్లు సాధించి పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో నిలిచింది.  ఆ జట్టు మిగిలిన మ్యాచులు సన్ రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తో ఆడాల్సి ఉంది.  ఆదివారం హైదరాబాద్ తో ఆ జట్టు కీలక పోరులో తలపడనున్నది.   ప్లేఆఫ్ చేరాలంటే సీఎస్కే.. ఇకపై జరుగబోయే ప్రతి మ్యాచ్ నెగ్గాల్సి ఉంది.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios