ఇంగ్లాండ్ డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా... 23 ఏళ్లకే బట్టతల, పొట్ట వచ్చేశాయంటూ ట్రోల్ చేసిన ప్రవాస భారతీయుడు..
పృథ్వీ షా.. 18 ఏళ్లకే టీమ్‌లోకి వచ్చిన యంగ్ సెన్సేషన్. అప్పటి టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అయితే పృథ్వీ షాని సచిన్ టెండూల్కర్ హైట్, వీరేంద్ర సెహ్వాగ్ దూకుడు, బ్రియాన్ లారా టెక్నిక్ కలగలిపిన ప్లేయర్‌గా అభివర్ణించాడు. అయితే ఆరంభంలో వచ్చిన క్రేజ్‌ని స్టార్‌డమ్‌గా ఫీలైపోయిన పృథ్వీ షా.. ఫిట్‌నెస్ విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టలేదు..
నిర్లక్ష్యంగా ఆడుతూ వికెట్ పారేసుకుంటూ టీమ్‌లో చోటు కోల్పోయాడు. ఐపీఎల్‌లో బాగా ఆడుతూ, రికీ పాంటింగ్‌తో ప్రశంసలు దక్కించుకున్న పృథ్వీ షా, 2023 సీజన్‌లో అట్టర్‌ఫ్లాప్ అయ్యాడు. దీంతో 6 మ్యాచుల తర్వాత అతన్ని టీమ్‌లో నుంచి తప్పించాల్సి వచ్చింది..
ప్రస్తుతం ఇంగ్లాండ్ డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీలో ఆడుతున్న పృథ్వీ, నార్తాంప్టన్‌షైర్ తరుపున డబుల్ సెంచరీ బాదాడు.. పృథ్వీ షా వయసు 23 ఏళ్లే అయినా జన్యుపరమైన కారణాలతో పాటు ఓపెనర్ కావడంతో అతనికి చిన్న వయసులోనే బట్టతల వచ్చేసింది. అదీకాకుండా అతను ఫిట్‌నెస్‌పై సరైన శ్రద్ధ పెట్టకపోవడంతో భారీగా బరువు పెరిగాడు. దీంతో చూడడానికి చాలా పెద్ద వయసు వాడిలా కనిపిస్తున్నాడు..
పృథ్వీ షా డబుల్ సెంచరీ ఫోటోలపై అంకుర్ నాగ్‌పాల్ అనే ఇంగ్లాండ్ వ్యాపారవేత్త బాడీ షేమింగ్ కామెంట్లు చేశాడు. ‘భారతీయుల డైట్‌కీ, వారి జన్యువులకు అస్సలు సంబంధమే ఉండదు. ఇతను 23 ఏళ్ల ఇండియన్ అథ్లెట్... 23!’ అంటూ ట్వీట్ చేశాడు అంకుర్. దీనిపై అంకుర్ వారికో అనే మరో రచయిత, వ్యవస్థాపకుడు కూడా వ్యంగ్యంగానే స్పందించాడు..
‘అయినా అతని తల్లి ఇంకా మావాడు సన్నగా అయ్యాడని అనుకుంటుంది..’ అంటూ వెకిలిగా నవ్వుతున్న ఎమోజీలను ట్వీట్ చేశాడు అంకుర్ వారికో. ఈ ట్వీట్లపై భారత క్రికెట్ ఫ్యాన్స్ స్పందించారు. పృథ్వీ షా తల్లి, అతనికి నాలుగేళ్ల వయసున్నప్పుడే చనిపోయిందని, విషయం తెలుసుకోకుండా బాడీ షేమింగ్ కామెంట్లు చేయవద్దంటూ కామెంట్లు చేశారు. దీంతో అంకుర్ వారికో తన తప్పు తెలుసుకుని, పృథ్వీ షాకి క్షమాపణలు కోరాడు..
‘జనాల కామెంట్ల తర్వాత నాకు నా తప్పు తెలిసి వచ్చింది. పృథ్వీ షా, తన నాలుగేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడనే విషయం నాకు తెలీదు. అది తెలిశాక నాకు చాలా బాధేసింది. ఇలాంటి కామెంట్లు చేసినందుకు సిగ్గుపడుతున్నా. నేను కేవలం మా అమ్మ, నేను ఎంత లావుగా ఉన్నా సక్కగా ఉన్నావని చెప్పేది. అలా తల్లి ప్రేమ గురించి చెబుదామని ఇలా కామెంట్ చేశా..
పృథ్వీ షా, నువ్వు ఈ ట్వీట్ చదువుతావని అనుకోవడం లేదు. ఒకవేళ చదివితే నన్ను క్షమించు. నిజంగా సారీ చెబుతున్నా. నేను క్రికెట్ చూడను, పృథ్వీ షా ఎవరో కూడా నాకు తెలీదు. నాకు తెలిసి ఉంటే ఇలా స్పందించి ఉండేవాడిని కాదు..’ అంటూ కామెంట్ చేశాడు అంకుర్ వారికో..
ఇంగ్లాండ్ డొమెస్టిక్ వన్డే కప్ 2023 టోర్నీ టోర్నీలో జరిగిన మొదటి మ్యాచ్‌లో 35 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసిన పృథ్వీ షా, పుల్ షాట్‌కి ప్రయత్నించి హిట్ వికెట్‌గా పెవిలియన్ చేరాడు. తాజాగా సోమర్‌సెట్‌తో జరిగిన మ్యాచ్‌లో 153 బంతుల్లో 28 ఫోర్లు, 11 సిక్సర్లతో 244 పరుగులు చేసి అద్భుత సెంచరీతో దుమ్మురేపాడు పృథ్వీ షా..
81 బంతుల్లో సెంచరీ అందుకున్న పృథ్వీ షా, ఆ తర్వాత మరింత స్పీడ్ పెంచి 48 బంతుల్లోనే రెండో సెంచరీ బాదేశాడు. మొత్తంగా 129 బంతుల్లో డబుల్ సెంచరీ బాదిన పృథ్వీ షా..లిస్ట్ ఏ క్రికెట్‌లో రెండో డబుల్ సెంచరీ నమోదు చేసుకున్నాడు.
