Asianet News TeluguAsianet News Telugu

వరల్డ్ కప్‌కి దూరంగా పాకిస్తాన్... అంధుల క్రికెట్ టీమ్‌కి వీసా క్లియరెన్స్ ఇవ్వని కేంద్రం...

పాకిస్తాన్ అంధుల క్రికెట్ టీమ్‌కి వీసా క్లియరెన్స్‌లో జాప్యం... డిసెంబర్ 5న ప్రారంభమైన అంధుల టీ20 వరల్డ్ కప్... పాకిస్తాన్ టీమ్‌ని తప్పిస్తున్నట్టు ప్రకటించిన నిర్వాహకులు.. 

Blind World cup 2022: Pakistan team not coming to India due to Visa Clearance Issues
Author
First Published Dec 8, 2022, 3:38 PM IST

పాకిస్తాన్ క్రికెట్ జట్టు, టీ20 వరల్డ్ కప్‌కి దూరమైంది. అదేంటి... ఇప్పటికే టీ20 వరల్డ్ కప్ ముగిసింది. అందులో పాకిస్తాన్ ఆడి,ఫైనల్ దాకా కూడా వెళ్లిందని అనుకుంటున్నారా? అవును.. ఇది అంధుల టీ20 వరల్డ్ కప్. డిసెంబర్ 5 నుంచి 17 వరకూ ఢిల్లీ, ఫరిదాబాద్, ముంబై, ఇండోర్, బెంగళూరు నగరాల్లో అంధుల టీ20 వరల్డ్ కప్ టోర్నీని నిర్వహిస్తున్నారు...

ఇప్పటికే ప్రారంభమైన ఈ వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్ మ్యాచులు డిసెంబర్ 15, 17 తేదీల్లో బెంగళూరు వేదికగా జరుగుతాయి. ఆతిథ్య భారత జట్టుతో పాటు నేపాల్‌, శ్రీలంక, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు ఈ టోర్నీలో పాల్గొంటాయి...

షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ జట్టు, డిసెంబర్ 5న భారత్‌కి రావాల్సి ఉంది. అయితే వీసా కారణాల వల్ల పాక్ టీమ్‌ రాక ఆలస్యమైంది. తాజాగా పాక్ టీమ్‌ని, టీ20 వరల్డ్ కప్ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించాడు క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) ప్రెసిడెంట్ మహంతేష్ జీకే...

‘పాకిస్తాన్ క్రికెట్ జట్టు, ఇండియాకి రావడం లేదు. వాళ్లకు ఇప్పటిదాకా వీసాలు రాలేదు....’ అంటూ తెలియచేశాడు సీఏబీఐ ప్రెసిడెంట్ మహంతేష్ జీకే. ‘పాకిస్తాన్ జట్టు, ఇస్లామాబాద్‌లోని ఇండియన్ హై కమీషన్ నుంచి  డిసెంబర్ 7న పాస్‌పోర్టులు తీసుకుంది. అయితే ఈ మెయిల్‌లో పాస్‌పోర్టులు వచ్చినా, భారత ప్రభుత్వం నుంచి వీసా క్లియరెన్స్ మాత్రం రాలేదు...’ అంటూ పాకిస్తాన్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ (పీబీసీసీ) ప్రకటన ద్వారా తెలియచేసింది..

అయితే భారత ప్రభుత్వం మాత్రం అంధుల క్రికెట్ వరల్డ్ కప్‌ కోసం 34 మంది పాకిస్తానీ ప్లేయర్లకు క్లియరెన్స్ ఇచ్చినట్టు చెబుతోంది. ‘కేంద్ర హోం శాఖ, 34 మంది పాకిస్తానీ ప్లేయర్లకు, అధికారులకు అంధుల క్రికెట్ వరల్డ్ కప్ 2022 టోర్నీలో పాల్గొనేందుకు వీసా క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది...’ అంటూ ప్రకటించింది కేంద్రం..

భారత ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చామని చెబుతుంటే, వరల్డ్ కప్ నిర్వాహకులు మాత్రం వీసా క్లియరెన్స్ రాని కారణంగా పాక్ క్రికెట్ టీమ్‌ని టోర్నీ నుంచి తప్పిస్తున్నట్టు ప్రకటించారు. 

అంధుల టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి భారత మాజీ క్రికెటర్, ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. ‘చూపు సరిగ్గా లేకపోయినా క్రికెట్‌ మీద అభిమానం, ఆట మీద అంకితభావంతో ఆడాలనుకునే వీళ్లంతా, ఎంతోమంది ఆదర్శంగా నిలుస్తున్నారు. అంధులకు ప్రతీ రోజూ పరీక్షే. వాళ్ల ప్రపంచమే వేరు. క్రికెట్ ప్రపంచంలో హద్దులు ఉండవు. 

క్రికెట్ నాకు ఎలా ఫైట్ చేయాలో నేర్పించింది. ఎలా పడిపోవాలో నేర్పించింది. నాతో నేను ఎలా స్నేహం చేయాలో నేర్పించింది. పడిన ప్రతీసారీ లేచి ఎలా ముందుకు నడవాలో నేర్పింది...’ అంటూ తెలియచేశాడు యువరాజ్ సింగ్...

ఆసియా కప్ 2023 టోర్నీ గురించి తీవ్రమైన చర్చ జరుగుతున్న సమయంలోనే పాకిస్తాన్ అంధుల క్రికెట్ టీమ్‌కి వీసా క్లియరెన్స్ రాకపోవడంలో జాప్యం జరిగి, ఆ టీమ్‌ టోర్నీ నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్ అయ్యింది. ఆసియా కప్ 2023 టోర్నీకి షెడ్యూల్ ప్రకారం పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది.

అయితే పాకిస్తాన్‌లో అడుగుపెట్టబోమని, తటస్థ వేదికగా ఆసియా కప్ 2023 టోర్నీ నిర్వహిస్తామని బీసీసీఐ సెక్రటరీ జై షా కామెంట్ చేశాడు. దీంతో ఆసియా కప్ 2023 టోర్నీ కోసం భారత జట్టు, పాక్‌కి రాకపోతే... ఇండియాలో జరిగే వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో పాకిస్తాన్ ఆడదని కామెంట్ చేశాడు పీసీబీ ఛైర్మెన్ రమీజ్ రాజా.. 

Follow Us:
Download App:
  • android
  • ios