తనకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ వృద్ధిమాన్ సాహాని బెదిరించిన ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్టు... విచారణ తర్వాత అతనిపై రెండేళ్ల నిషేధం విధించిన బీసీసీఐ...
భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాని ఓ ప్రముఖ జర్నలిస్టు బెదిరింపులకు పాల్పడుతూ వాట్సాప్ మెసేజ్‌లు పంపిన ఉదంతం... సోషల్ మీడియాలో పెను సంచలనం క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తనను బెదిరిస్తూ పంపిన వాట్సాప్ మెసేజ్‌లను సోషల్ మీడియాలో షేర్ చేశాడు వృద్ధిమాన్ సాహా...
శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కి ఎంపిక చేసిన భారత జట్టులో చోటు కోల్పోయాడు వృద్ధిమాన్ సాహా. ఆ సమయంలో బీసీసీఐపై, భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌పై సాహా చేసిన కొన్ని కామెంట్లు తెగ వైరల్ అయ్యాయి. దీంతో తనకు ఇంటర్వ్యూ ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఓ ప్రముఖ జర్నలిస్టు... సాహాని బెదిరించాడు...
ఈ బెదిరింపు మెసేజ్‌లను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన వృద్ధిమాన్ సాహా... ‘ఇన్నేళ్లుగా నిస్వార్థంగా భారత క్రికెట్ జట్టుకి సేవ చేసినందుకు నా దక్కిన గౌరవం ఇది...’ అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. సాహాకు భారత మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్‌తో పాటు భారత క్రికెట్ బోర్డు అధికారులు కూడా సపోర్టుగా నిలిచారు...
ఆ జర్నలిస్టు పేరు చెబితే చాలని, అతని పని తాము చూసుకుంటామని హామీ ఇచ్చారు. సాహా వాగ్మూలం స్వీకరించి, ఈ విషయంపై పూర్తి విచారణ చేపట్టిన బీసీసీఐ... ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్ బొరియా మజుందర్‌కి వివరణ ఇవ్వాల్సిందిగా నోటీసులు పంపింది...
తొలుత వృద్ధిమాన్ సాహా సంఘటనకీ తనకు ఎలాంటి సంబంధం లేదని వ్యాఖ్యానించిన బొరియా మంజుదర్, ఆ తర్వాత కొన్నాళ్లకు ఆ మెసేజ్‌లు పంపింది... తానేనని అయితే తన మెసేజ్‌లను ఎడిట్ చేసి మార్చేశారని ఆరోపించాడు... అయితే ఈ బీసీసీఐ విచారణ అనంతరం మంజుదర్ చెప్పినవన్నీ అబద్ధాలేనని తేల్చారు అధికారులు..
ఈ మొత్తం సంఘటనపై విచారణ చేసిన బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ సభ్యుడు ప్రభతేజ్ భాటియా... ఈ విషయంలో బొరియా మజుందర్‌ని దోషిగా తేల్చింది.
భారత క్రికెటర్‌పై బెదిరింపులకు పాల్పడినట్టు కౌన్సిల్ ముందు బొరియా మజుందర్ అంగీకరించడంతో అతనిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. భారత్‌లోని అన్ని రాష్ట్రాల క్రికెట్ బోర్డులకు ఈ నిషేధం గురించి స్టేట్‌మెంట్ పంపిన బీసీసీఐ, దాంతో పాటు మ్యాచ్ రిపోర్టింగ్ చేసేందుకు బొరియా మజుందర్‌కి ఇచ్చిన అక్రిడేషన్ కార్డును కూడా క్యాన్సిల్ చేసింది...
అలాగే అతన్ని బ్లాక్ లిస్టులో పెట్టాల్సిందిగా ఐసీసీని కోరిన బీసీసీఐ... బొరియా మజుందర్‌ని స్టేడియంలోకి మ్యాచులు చూసేందుకు కూడా అనుమతించకుండా రెండేళ్ల పాటు నిషేధం విధించింది. అలాగే అతనితో ఎలాంటి ఇంటర్వ్యూలు కానీ, ఫోన్ కాల్స్ కానీ మాట్లాడకూడదని ప్లేయర్లకు సూచించింది భారత క్రికెట్ బోర్డు.. ఒకవేళ బీసీసీఐ ఆదేశాలను అతిక్రమించి, ఏ ప్లేయర్ అయినా బొరియా మంజుదర్‌తో చర్చలు జరిపితే, అతనిపై కూడా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది భారత క్రికెట్ బోర్డు.
