India Vs South Africa ODI Series: ఇన్నాళ్లు కనుసైగతో భారత క్రికెట్ ను శాసించిన టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి తిరిగి సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ కోసం అతడు...
దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భారత జట్టు టెస్టు సిరీస్ కోల్పోయినా వన్డే సిరీస్ మాత్రం ఎట్టి పరిస్థితులలో చేజార్చుకోకూడదనే పట్టుదలతో ఉంది. టెస్టు సిరీస్ లో టీమిండియాను విరాట్ కోహ్లి నడిపించగా.. వన్డేలలో కెఎల్ రాహుల్ నాయకుడిగా వ్యవహరించనున్నాడు. ఈ పర్యటనకు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్ కు రోహిత్ శర్మను సారథిగా నియమించినా అతడు చేతి వేలికి గాయం కారణంగా సిరీస్ కు మొత్తం సిరీస్ కు దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో కెఎల్ రాహుల్ తాత్కాలిక సారథిగా వ్యవహరిస్తున్నాడు. టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.
భారత్-దక్షిణాఫ్రికా మధ్య తొలి వన్డే ఈనెల 19న (బుధవారం) పార్ల్ వేదికగా బొలాండ్ పార్క్ లో జరుగనుంది. ఈ మేరకు మెన్ ఇన్ బ్లూ.. తొలి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో కెఎల్ రాహుల్ కెప్టెన్ గా తదుపరి గేమ్ లో అనుసరించాల్సిన వ్యూహాలను జట్టుకు వివరిస్తుండగా.. విరాట్ కోహ్లి సాధారణ ఆటగాడిగా ఆలకించాడు.
ఇందుకు సంబంధించిన చిత్రాలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పంచుకుంది. ‘వన్డే మోడ్ ఆన్..’ అంటూ ఈ చిత్రాలను షేర్ చేసింది. ఈ ఫోటోలలో జట్టు సభ్యులంతా ఒకచోట సమావేశమవగా.. హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు కెఎల్ రాహుల్ కూడా జట్టు సభ్యులకు ఏదో చెబుతున్నట్టుగా ఉంది. ఈ ఫోటోలలో విరాట్ కోహ్లి.. రాహుల్ చెప్పిన విషయాలను శ్రద్ధగా ఆలకిస్తుండటం గమనించొచ్చు. ఇన్నాళ్లు సారథిగా ఉన్న కోహ్లి.. తన జూనియర్ అయిన రాహుల్ సారథ్యంలో తొలి సారి వన్డే ఆడనున్నాడు. ఇటీవలే టెస్టు సారథ్యానికి కూడా గుడ్ బై చెప్పిన కోహ్లి.. ఏ మేరకు స్వేచ్ఛగా రాణించగలడనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ షెడ్యూల్ :
- జనవరి 19, తొలి వన్డే : పార్ల్, (బొలాండ్ పార్క్)
- జనవరి 21, రెండో వన్డే : పార్ల్, (బొలాండ్ పార్క్)
- జనవరి 23 , మూడో వన్డే : న్యూలాండ్స్, (కేప్టౌన్)
తర్వాత టెస్టు సారథి అతడేనా..?
టెస్టు సారథ్యం నుంచి కోహ్లి వైదొలిగిన నేపథ్యంలో తర్వాత సారథి ఎవరనేదానిమీద బీసీసీఐ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. అయితే రోహిత్ శర్మకే ఆ బాధ్యతలు అప్పజెప్పుతారని వార్తలు వస్తున్నాయి. కానీ రోహిత్.. 2023 వన్డే ప్రపంచకప్ తర్వాత అన్ని ఫార్మాట్లలో ఆడటం కష్టమే. అతడి వయసు ఇప్పటికే 34 ఏండ్లు దాటింది. దీంతో యువకుడైన కెఎల్ రాహుల్ కు గానీ, రిషభ్ పంత్ కు గానీ టీమిండియా టెస్టు కెప్టెన్సీని అప్పజెప్పాలనే వాదనలు ఎక్కువవుతున్నాయి. ఈ ఇద్దరూ భారత జట్టుకు ఇంకా సుదీర్ఘకాలం సేవలందించే అవకాశముంది.
అయితే బ్యాటర్ గా అద్భుతమైన ప్రదర్శన చేసే కెఎల్ రాహుల్ కు సారథిగా గొప్ప రికార్డు ఏమీ లేదు. ఐపీఎల్ లో పంజాబ్ సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా పనిచేసిన అతడు.. 27 మ్యాచులలో 11 మ్యాచులను మాత్రమే గెలిచాడు. ఇక ఇటీవలే ముగిసిన టెస్టు సిరీస్ లో విరాట్ కోహ్లి కి గాయం కావడంతో జోహన్నస్బర్గ్ టెస్టులో సారథిగా వ్యవహరించినా అందులో కూడా పరాజయమే ఎదురైంది. అయితే కోచ్ రాహుల్ ద్రావిడ్ మార్గనిర్దేశనంలో అతడు గొప్పగా రాణిస్తాడని, జట్టును విజయతీరాలకు చేర్చుతాడనే వారు లేకపోలేదు. ఏదేమైనా భవిష్యత్ అవసరాల దృష్ట్యా.. రాహుల్ ను టెస్టు సారథిగా చేస్తేనే బెటరని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
