India Vs Srilanka T20Is: లంకతో సిరీస్ కు ముందు భారత్ కు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే కీలక ఆటగాళ్లైన  విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ లు దూరం కాగా.. ఇప్పుడు మరో ఇద్దరు  స్టార్ ప్లేయర్లు కూడా దూరమయ్యారు. 

భారత పర్యటనకు వచ్చిన శ్రీలంక.. గురువారం నుంచి లక్నో వేదికగా టీమిండియాతో ప్రారంభం కాబోయే తొలి టీ20తో సిరీస్ ను ప్రారంభించనుంది. అయితే ఈ సిరీస్ కు ముందే టీమిండియా టాపార్డర్ బ్యాటర్ విరాట్ కోహ్లి, రిషభ్ పంత్ తో పాటు ఆల్ రౌండర్ దీపక్ చాహర్ దూరం కాగా తాజాగా భారత్ కు మరో షాక్ తగిలింది. మిడిలార్డర్ లో కీలక ఆటగాడైన సూర్యకుమార్ యాదవ్ కూడా సిరీస్ కు దూరమయ్యాడు. లంకతో సిరీస్ కు ముందే అతడికి గాయమైనట్టు సమాచారం. రేపు లక్నో వేదికగా తొలి టీ20 జరుగనుండగా.. 26, 27 లలో ధర్మశాలలో రెండు, మూడో మ్యాచులు జరుగుతాయి. 

 శ్రీలంకతో సిరీస్ కు సిద్ధమైన సూర్య కుమార్ యాదవ్.. మంగళవారం లక్నోతో ప్రాక్టీస్ సెషన్ లో కనిపించినప్పటికీ కాస్త ఇబ్బందిగా ఫీలయ్యాడు. ఈడెన్ గార్డెన్ లో విండీస్ తో టీ20 సిరీస్ సందర్భంగా మూడో టీ20లో అతడికి గాయమైనట్టు సమాచారం. చేతికి గాయమైనా అతడు ఫీల్డింగ్ చేయడంతో అది కాస్తా ఎక్కువైందని తెలుస్తున్నది. 

మంగళవారం బీసీసీఐ అధికారిక ట్విట్టర్ ఖాతాలో సూర్యతో పాటు టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసింది. అయితే బుధవారం మాత్రం గాయం కారణంగా అతడికి నొప్పి ఎక్కువైందని, సూర్యకు మూడు వారాల విశ్రాంతి అవసరమని జట్టు మేనేజ్మెంట్ వర్గాలు తెలిపాయి.

Scroll to load tweet…

లంకతో సిరీస్ కు ముందే భారత జట్టు.. విరాట్ కోహ్లితో పాటు రిషభ్ పంత్ లకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. పని భారం తగ్గించేందుకు టీమిండియా వాల్లకు విశ్రాంతినిచ్చింది. ఇదే క్రమంలో విండీస్ తో వన్డే సిరీస్ లో గాయమైన కెఎల్ రాహుల్ కూడా ఇంకా కోలుకోకపోవడంతో అతడు కూడా లంకతో సిరీస్ కు దూరమయ్యాడు. ఈ ముగ్గురితో పాటు తొడ కండరాల గాయంతో దీపక్ చాహర్ కూడా సిరీస్ నుంచి తప్పుకున్నాడు. తాజాగా చేతికి గాయంతో సూర్యకుమార్ యాదవ్ కూడా సిరీస్ కు దూరం కావడం గమనార్హం. 

నలుగురు కీలక ఆటగాళ్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగుతున్నది. గాయపడిన ఆటగాళ్ల జాబితాలో కొత్త ఆటగాళ్లను కూడా ఎంపిక చేయకుండానే భారత్ మ్యాచులు ఆడే అవకాశమున్నది. చాహర్, సూర్యకు గాయం కావడంతో లంకతో ఎంపికైన ఆటగాళ్ల సంఖ్య 16కు పడిపోయింది. ఇక కోహ్లి, పంత్, సూర్యకుమార్ యాదవ్ లు దూరం కావడంతో మిడిలార్డర్ లో శ్రేయాస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్ కీలకం కానున్నారు. ఈ ముగ్గురు దూరం కావడంతో సంజూ శాంసన్ ను ఆడించే అవకాశం కూడా ఉంది.

శ్రీలంకతో సిరీస్ కు భారత టీ20 జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చాహర్, రవీంద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, హర్షల్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, అవేశ్ ఖాన్