Bangladesh Test Captain: పరిమిత ఓవర్ల క్రికెట్ లో అడపాదడపా సంచలనాలు సృష్టించే బంగ్లాదేశ్ టెస్టులలో ఇప్పటికీ ఆ స్థాయి ఆటను ప్రదర్శించడం లేదు. తాజాగా ఆ జట్టు వరుస ఓటములతో బంగ్లా టెస్టు కెప్టెన్ కూడా  తన పదవి నుంచి తప్పుకున్నాడు. 

వరుస ఓటములు, సిరీస్ పరాజయాలతో సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్న బంగ్లాదేశ్ టెస్టు జట్టు సారథి మోమినుల్ హక్ తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఒత్తిడిని భరించలేకున్నానని.. టెస్టు బాధ్యతల నుంచి తాను వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. గతేడాది పాకిస్తాన్ తో స్వదేశంలో జరిగిన టెస్టు సిరీస్ నుంచి మొదలు ఇప్పటివరకు నాలుగు సిరీస్ లు వరుసగా ఓడిన బంగ్లాదేశ్ కు తాను సారథిగా ఉండటం భావ్యం కాదన్నాడు. ఈ మేరకు తన రాజీనామా నిర్ణయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) కి పంపాడు.

2019 నుంచి మోమినుల్ హక్ బంగ్లాదేశ్ టెస్టు జట్టుకు కెప్టెన్ గా పని చేస్తున్నాడు. అయితే అతడి హయాంలో బంగ్లా జట్టు టెస్టులలో మరింత బలహీనపడిందే గానీ గొప్ప, అనూహ్య విజయాలు సాధించిందేమీ లేదు. కెప్టెన్ గా 17 టెస్టులకు సారథ్యం వహించిన అతడు.. 3 మ్యాచులు మాత్రమే గెలిచాడు. 12 మ్యాచులలో ఓడాడు. రెండు టెస్టులు డ్రా అయ్యాయి. 

జట్టుగా ఓడటమే గాక బ్యాటర్ గా కూడా మోమినుల్ తీవ్ర నిరాశపరిచాడు. 2022 లో ఆరు టెస్టులు ఆడిన అతడు.. 16.20 సగటుతో 162 పరుగులు మాత్రమే చేశాడు. 

కాగా తన ప్రదర్శన, బంగ్లాదేశ్ టెస్టు కెప్టెన్ గా వైదొలగడానికి గల కారణాలను మోమినుల్ వివరిస్తూ.. ‘మీరు భాగా ఆడినప్పుడు జట్టు గెలవకున్నా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకునే అవకాశముంటుంది. కానీ మీరే విఫలమవుతూ జట్టుకు నీతులు చెప్పడమనేది భావ్యం కాదు. కెప్టెన్ గా ఉంటూ నేను ఆటగాడిగా రాణించకపోవడమనేది మంచి పద్దతి కాదన్నది నా అభిప్రాయం. అందుకే నేను ఆ బాధ్యతల నుంచి విముక్తి కావడమే మంచిదనుకున్నాను..’ అని తెలిపాడు. 

అంతేగాక కెప్టెన్సీ కోల్పోయిన నేపథ్యంలో తాను తన బ్యాటింగ్ పై దృష్టిసారిస్తానని తిరిగి ఫామ్ అందుకుంటానని హక్ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇదే విషయాన్ని తాను బీసీబీ ముందు కూడా ఉంచానని కానీ వాళ్లు నన్ను కెప్టెన్ గా కొనసాగాలని అడిగారని చెప్పాడు. అయితే తాను బ్యాటర్ గా విఫలమవుతూ జట్టుకు మరింత భారమవడం తనకు ఇష్టం లేదని.. తాను దిగిపోతానని నిశ్చయించుకున్నానని తెలిపాడు. 

Scroll to load tweet…

ఈ ఏడాది న్యూజిలాండ్ సిరీస్ వెళ్లిన బంగ్లాదేశ్.. అక్కడ కివీస్ తో జరిగిన తొలి టెస్టు లో అనూహ్య విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కివీస్ పై టెస్టులలో ఆ జట్టుకు ఇదే తొలి విజయం. అయితే జట్టుగా బంగ్లాదేశ్ కు కూడా అదే ఆఖరి విజయం. ఆ తర్వాత రెండో టెస్టు డ్రా అయింది. దాని తర్వాత దక్షిణాఫ్రికా కు వెళ్లిన బంగ్లాదేశ్.. అక్కడా ఓడింది. ఇటీవలే శ్రీలంకతో రెండు మ్యాచుల టెస్టు సిరీస్ లో కూడా 0-1తో సిరీస్ లో పరాజయం పాలైంది.

మోమినుల్ హక్ కెప్టెన్ గా దిగిపోయిన నేపథ్యంలో ఆ జట్టు ఆల్ రౌండర్ షకిబ్ ఉల్ హసన్ ను టెస్టు జట్టు సారథిగా నియమించాలని బీసీబీ భావిస్తున్నది. అయితే దీనిపై చర్చించాకే తుది నిర్ణయం తీసుకుంటామని బీసీబీ తెలిపింది. ప్రస్తుతం షకిబ్ వయసు దృష్ట్యా అతడు ఎక్కువ కాలం కెప్టెన్ గా కొనసాగే అవకాశం లేదు. షకిబ్ కు కాకుంటే కెప్టెన్ గా సమర్థుడు ఎవరున్నారనేదానిపై బీసీబీ కసరత్తులు చేస్తున్నది.